రవిప్రకాశ్.. తెలుగునాట ఎలక్ట్రానిక్ జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన జర్నలిస్టు. ఎన్ని వివాదాలు ఉన్నా.. ఈ విషయంలో మాత్రం ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. అయితే టీవీ9 స్థాపించడమే కాకుండా దాన్ని విజయవంతంగా నడిపించారాయన. అయితే అదే సమయంలో ఆయన నియంతృత్వ, ఏకపక్ష ధోరణి ద్వారా అనేక వివాదాల్లోనూ చిక్కుకున్నారు. టీవీ9 సంస్థలో ఓ ఉద్యోగిగా కాక.. అన్నై తానై వ్యవహరించిన రవిప్రకాశ్ ఆ వెసులుబాటులో అక్రమాలు చేశారని ప్రస్తుత యాజమాన్యం ఆరోపిస్తోంది.

 

 

టీవీ9 పాత యాజమాన్యంలో ఉన్నంతవరకూ రవిప్రకాశ్ ఓ వెలుగు వెలిగారు. అయితే టీవీ9 యాజమాన్యం మారక.. టీవీ9నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారంటూ కొత్త యాజమాన్యం ఆయనపై ఆరోపించింది. కేసులు పెట్టింది. ఈ విషయంలో ఆయన కొన్ని రోజులు జైల్లోనూ ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. మరో కొత్త ఛానల్ పెట్టే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.

 

 

ఈ సమయంలో మరో వివాదంలో ఆయన చిక్కుకున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14లోని బీఎన్ రెడ్డి కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో పోలీసులు కొన్నాళ్లుగా వెతుకుతున్న ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా పట్టుబడ్డాడట. అసలు సుకేశ్ గుప్తా ఎందుకు రవిప్రకాశ్ ఇంట్లో తలదాచుకున్నాడు? ఆయనకీ రవిప్రకాశ్ కూ ఏంటి సంబంధం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుకేశ్ గుప్తా ఓ ఆర్థిక నేరగాడు. ఒకే ఆస్తిని ఇద్దరికి వందల కోట్లకు తాకట్టు పెట్టినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి.

 

ఇప్పుడు ఆ నేరగాడు రవిప్రకాశ్ ఇంట్లో దొరకడం ఏంటి.. ఈ ఆర్థిక వివాదానికి రవిప్రకాశ్ కు సంబంధం ఏంటి..అసలు నిందితులను రవి ప్రకాశ్ ఎందుకు ఇంట్లో పెట్టుకుని మేపుతున్నారు.. ఈ కేసులోరవిప్రకాశ్ నూ మరోసారి అరెస్టు చేస్తారా..ఇప్పుడు ఇవీ సమాధానం తెలియాల్సిన ప్రశ్నలు.

మరింత సమాచారం తెలుసుకోండి: