ఐపీఎస్ అధికారి... ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో షాక్ తగిలింది. ఆయన ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఏపీ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఆగస్ట్ 5 వరకూ ఏబీ పై ఉన్న సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీస్ అధికారుల సస్పెన్షన్ రివ్యూ కమిటీ నివేదిక ఆధారంగా పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

 

గతంలో చంద్రబాబు హయాంలో ఈ ఏబీ వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. అయితే ఆ కాలంలో భద్రతా పరికరాల కొనుగోలులో అతిక్రమణలు జరిగాయంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత.. సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ సర్కారు తొలగించింది.

 

 

అయితే ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ సర్కారు చర్య కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని తెలుగు దేశం నేతలు అప్పట్లో మండిపడ్డారు కూడా. అయితే..తన సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్..క్యాట్ ను ఆశ్రయించారు. అక్కడ కూడా ఫలితం దక్కలేదు. ఆయన పిటిషన్ ను క్యాట్ కొట్టివేసింది. ఇక ఇప్పుడు ఏపీ సర్కారు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

 

 

ఆయన సస్పెన్షన్ ను ఆగస్టు 5 వరకు కొనసాగిస్తున్నట్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏసీబీ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వ కమిటీ సిఫారసుల మేరకు సస్పెన్షన్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో తన సస్పెన్షన్ సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు మీడియాకు ప్రకటనలు విడుదల చేయడం ద్వారా తన శ్రేయోభిలాషులకు సందేశం పంపారు. మరి ఇప్పుడు ఈసస్పెన్షన్ పొడిగింపుపై ఎలా స్పందిస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: