నిద్ర లేని నగరంగా పేరున్న న్యూయార్క్ సిటీకి.. కరోనా కాళరాత్రులు మిగులుస్తోంది. అమెరికాలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన న్యూయార్క్ లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ కనీసం మృతదేహాల్ని ఖననం చేసే పరిస్థితి కూడా లేదు. న్యూయార్క్ లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. చైనా, బ్రిటన్ కంటే ఇక్కడే కేసులు ఎక్కువగా ఉన్నాయి. 

 

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌కి నిద్రలేని నగరమని పేరు. ఇప్పడు నిజంగానే ఆ నగరానికి కంటి మీద కునుకు రావడం లేదు. కంటికి కనిపించని  శత్రువు మింగేస్తోంది. కోవిడ్‌-19 ఉక్కు పిడికిట్లో న్యూయార్క్‌ విలవిలలాడుతోంది. ప్రపంచంలో మరే ఇతర దేశంలో కూడా కరోనా ఈ స్థాయిలో కలకలం సృష్టించలేదు. యూరప్‌లోని స్పెయిన్, ఇటలీల కంటే న్యూయార్క్‌ పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. 

 

మార్చి 1న తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి నెల రోజుల్లోనే  వైరస్‌ ధాటికి అంతటి మహానగరం కకావికలమైపోతోంది. న్యూయార్క్‌ వాణిజ్య రాజధాని కావడంతో రాకపోకలు ఎక్కువ. ఇసుక వేస్తే రాలనంత జనసమ్మర్థంతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. మొత్తం జనాభా 86  లక్షలైతే, ఒక చదరపు కిలోమీటర్‌కి 10 వేల మంది నివసిస్తారని అంచనా. జనాభా ఎక్కువ కావడంతో సబ్‌ వేలు ఎక్కువగా నిర్మించారు. ప్రయాణాలన్నీ అండర్‌  గ్రౌండ్‌ రైళ్ల ద్వారానే జరుగుతాయి. అందుకే ఇక్కడ భౌతిక దూరం పాటించడం అంత సులువు కాదు. నగరాన్ని ఏటా 6 కోట్ల మంది సందర్శిస్తుంటారు. అందుకే  కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపించింది. ప్రస్తుతం న్యూయార్క్ లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. దీంతో కరోనా బాధితుల సంఖ్యలో న్యూయార్క్ చైనా, బ్రిటన్ ను దాటేసింది. న్యూయార్క్ లో గత వారం విషాద వారంగా మిగిలిపోతుందని నగర మేయర్ వ్యాఖ్యానించారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

 

న్యూయార్క్‌లో సామాజిక ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువ. బ్రాంక్స్, క్వీన్స్‌ వంటి ప్రాంతాల్లో ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల నుంచి  వచ్చిన వారు. బ్రాంక్స్‌లో 84 శాతం నల్లజాతీయులే ఉన్నారు. ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు లేవు. అందుకే వీరిలో ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ.  వీళ్లలో అత్యధికులు సర్వీసు వర్కర్లుగా ఉన్నారు. నర్సులు, సబ్‌వే సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, మాల్స్‌లో పనిచేసే సిబ్బంది.. ఇలా న్యూయార్క్‌లో  ఉపాధి పొందుతున్న వారిలో 79 శాతం ఫ్రంట్‌ లైన్‌ ఉద్యోగులే. వాళ్లపై కరోనా సులభంగా పంజా విసిరింది. ఆ ప్రాంతాల్లోనే కల్లోలం రేపుతోంది. 

 

అమెరికాలో మొదటి నుంచీ న్యూయార్క్ పైనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. కరోనా కారణంగా అమెరికా మొదటిసారి మహావిపత్తు ప్రకటించిన రాష్ట్రం కూడా న్యూయార్కే. మొన్నటిదాకా అమెరికాలో 90 శాతం కేసులు కూడా ఒక్క న్యూయార్క్ లోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అవి ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ప్రస్తుతానికి న్యూయార్క్ లో కేసుల సంఖ్య తగ్గకపోయినా.. వ్యాప్తి మాత్రం తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: