ఆమ్రపాలి.... కలెక్టర్ గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన పేరు. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మంది కలెక్టర్లు పని చేయగా ఆమ్రపాలి మాత్రమే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. అమ్రపాలి మాటలు, వ్యాపకాలు, నిర్ణయాలు, డ్రెస్సింగ్ స్టైల్ ఆమెను ఇతర కలెక్టర్లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఉద్యోగుల కోసం 500 టికెట్లు బుక్ చేయడం... ఉద్యోగ ఇంటర్వ్యూల్లో అబద్ధాలు చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం... యూత్ లో ఆమె సక్సెస్ ఫుల్ ఐకాన్ గా ఉండటానికి కారణమయ్యాయి. 
 
ఆమ్రపాలి తన కన్నా జూనియర్ అయిన 2011 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మను ప్రేమించి 2018లో పెళ్లి చేసుకున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆమ్రపాలి 2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంకు సాధించారు. మంచి ర్యాంకును సొంతం చేసుకోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో ట్రైనీగా కెరీర్ ను ప్రారంభించారు. తర్వాతి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఆప్షన్ తీసుకుని 2014లో వికారాబాద్ జిల్లా సబ్ కలెక్టర్ గా పని చేశారు. 
 
ఆ తర్వాత శిశు సంక్షేమ శాఖ విభాగంలో పని చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఆమ్రపాలికి కలెక్టర్ గా అవకాశం దక్కింది. 2016 సంవత్సరం అక్టోబర్ నెలలో ఆమ్రపాలి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగపరంగా అమ్రపాలి చేసిన పనులకు పలు అవార్డులు సైతం వచ్చాయి. అమ్రపాలి కలెక్టర్ గా పాలనలో కూడా తనదైన ముద్రను వేశారు. 
 
ఆమ్రపాలి 1982 సంవత్సరం నవంబర్ 4న విశాఖలో వెంకట్ రెడ్డి, పద్మావతి దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర బోధకుడిగా పని చేశారు. వైజాగ్ లోని సత్య సాయి మందిరంలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. అనంతరం ఐఐఎం బెంగళూరు నుంచి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టభద్రురాలయ్యారు. 
 
కలెక్టర్ గా ఆమె వరంగల్ అర్బన్ జిల్లాను ప్రగతి పథంలో నడిపించారు. తన ఆత్మీయత, మానవీయ కోణంతో జనం హృదయాలను గెలుచుకున్నారు. పేదలు, నిస్సహాయులకు ప్రయోజనం చేకూరేలా కలెక్టర్ గా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. పేదల పక్షపాతిగా ఆమ్రపాలి జనం మెప్పు పొందారు. జిల్లాను అన్ని విషయాల్లో అగ్ర స్థానంలో ఉంచడమే లక్ష్యంగా పని చేశారు. 2019 అక్టోబర్ నెలలో ఈమె డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. అమ్రపాలి కేంద్ర కేబినెట్‌ సచివాలయంలో ఉప కార్యదర్శిగా నియమితులయ్యారు. నాలుగేళ్ల పాటు ఆమె పదవిలో కొనసాగనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: