భగవంతునికి.. భక్తునికి అనుసంధానమైన అర్చకులకూ కరోనా కాటు తప్పలేదు. లాక్ డౌన్ తో గుళ్లు మూతపడడంతో... స్వామి, అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు నిలిచిపోయాయి. దీంతో.. అర్చకులకు ఆదాయం లేకుండా పోయింది. పూజలు, హోమాలు, పెళ్లిళ్లే కాదు.. శుభ అశుభ కార్యక్రమాలూ లేక పంతుళ్లకు పైసా దొరకడం లేదు. దేవుడే దిక్కని జీవించే తాము... ఇప్పుడు దిక్కులేకుండా పోయామంటున్నారు. 

 

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న మారణహోమానికి ప్రపంచమంతా దేవుడే దిక్కంటోంది. కానీ... దేవుడినే నమ్ముకున్న అర్చకులనూ కలవరపెడుతోంది కరోనా. నిత్యం లక్షలాది భక్తులు దర్శించే తిరుమల వెంకన్న ఆలయం మొదలుకుని.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న ఆలయల వరకు అన్నీ మూతపడ్డాయి. కొన్ని ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలూ కరువయ్యాయి. 

 

నిత్యం దైవ సేవలో ఉంటూ... భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉండే అర్చకుల పరిస్థితి దయనీయంగా మారింది. లాక్ డౌన్ తో ఆలయాలు మూత పడటంతో.. అర్చకుల ఆదాయానికి గండిపడింది. అంతా బాగున్న రోజుల్లోనే.. అరకొరగా... అన్నింటా అడ్జస్ట్ అవుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే అర్చకులు, పూజారులు... ఇప్పుడున్న పరిస్థితుల్లో పూట గడవడం కష్టంగా మారిందంటున్నారు. 

 

కొన్ని ఆలయాల్లో అర్చకులకు జీతాల్లేవు... ఉన్నచోట చాలీచాలని జీతాలు. మరికొందరికి హారతి లో భక్తులు వేసే పది ఇరవై.. మహా అయితే 50, 100 రూపాయలే  జీవనాధారం. మరికొందరు వంశాచారంగా వస్తున్న ఆలయాలను పర్యవేక్షిస్తూ.. ఆలయాన్నే నమ్ముకుని బతికే వాళ్ళూ ఉన్నారు. నెలకు ఐదు వేల రూపాయలు కూడా రాని ఆలయాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఆలయ అర్చకుల పరిస్థితి వర్ణనాతీతం. 

 

ఇక పెళ్లిళ్లు, పూజలు, హోమాలు, గృహ ప్రవేశాలు, శుభాశుభ కార్యక్రమాలే జీవనాధారంగా బతికే పంతుళ్ళు చాలామందే ఉన్నారు. ఏడాదిలో.. మంచిరోజులున్న సీజన్ హ్యాపీగా గడిస్తే చాలు.. ఏడాదంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంపాదించుకునే వాళ్ళు. కానీ... సరిగ్గా పెళ్లిళ్ల సీజన్ లోనే మంచి ముహూర్తాలున్న రోజుల్లోనే కరోనా మహమ్మారి ప్రవేశించి, ఇలాంటి వారి పొట్ట కొట్టింది లాక్ డౌన్. 

 

గ్రామాల్లో ప్రజలు కొందరు నిత్యావసరాలు అందిస్తున్నా..అవి ఎక్కువ రోజులు సరిపోవడం లేదని, మళ్లీ మళ్లీ అడగలేమని, వాళ్లూ ఇవ్వలేరని పూజారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాధారణ రోజుల్లో పూజారులు, అర్చకులను దేవుడితో సమానంగా చూసే జనాలు ఇప్పుడు కన్నెత్తి చూడటం లేదంటున్నారు. 

 

ఎవరికైనా కష్టం వస్తే.. ఫలానా వాళ్ళు ఆదుకుంటారు, తీరుస్తారు... అనే నమ్మకం ఉన్నవారిని అడుగుతారు. అది చేయుదాటితే.. దేవుడే దిక్కనుకుంటారు. దేవుడినే నమ్ముకున్న తమకు ఇక దిక్కెవరు అంటున్నారు అర్చకులు. ప్రభుత్వాలే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: