కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ వలస కార్మికుల జీవితాలను నరక కూపంలో తోసేసింది. కరోనా మహమ్మారి వలన ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు తరలివచ్చిన కోట్ల మంది వలస కూలీల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలి వచ్చిన వారందరూ ఒకవైపు ఆకలి మంటలతో నరకయాతన అనుభవిస్తూ... మరోవైపు ఊరికానీ ఊరిలో కరోనా మహమ్మారి బారినపడి ఎక్కడ చనిపోతామోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అందుకే వందల వేల కిలోమీటర్ల లో దూరంలో ఉన్న తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. పుట్టిన పసిపాపల నుండి వృద్ధుల వరకు అందరూ దూరాభారం లెక్కచేయకుండా ఎర్రటి ఎండలో వందల కిలోమీటర్లు కాలినడకన, సైకిల్స్, రిక్షాల పై సొంత ఊర్లకు బయలుదేరారు. 


ఇందులోని భాగంగానే బీహార్ రాష్ట్రంలోని అరారియాకు చెందిన తబారే ఆలం అనే 11 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులను రిక్షా పై కూర్చోబెట్టి 500 కిలోమీటర్ల దూరంలోనే తన సొంత ఊరికి బయల్దేరాడు. ఈ 11 ఏళ్ల బాలుడు తండ్రి రిక్షా కార్మికుడు కాగా... తను ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఐతే గత 50 రోజులుగా భారతదేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో... తనకి రిక్షా కూలి దొరకడం లేదు. దాంతో డబ్బులు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఎలాగో వారణాసిలో ఉపాధి లేదు కాబట్టి తమ సొంత ఊరైన అరారియాకు వెళ్లిపోవాలని భావించిన తండ్రి తన ఒక్కగానొక్క ఆధారమైన రిక్షాపై తమకు సంబంధించిన అన్ని వస్తువులను వేసుకొని 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటి బాట పట్టారు. 

కానీ 50 ఏళ్లు దాటినా ఆ తండ్రి రిక్షా కొంత దూరం మాత్రమే తొక్కి అలసి పోవడం తబారే ఆలం మనసును బాగా డిస్టర్బ్ చేసింది. అందుకే తనది రిక్షా తొక్కే వయసు కాకపోయినా... తన అమ్మా నాన్నలను స్వస్థలాలకు చేర్చే బాధ్యత తన భుజాలపై వేసుకున్నాడు. తన శక్తిని మొత్తం ఉపయోగించి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంత ఇంటికి చేరుకొని అందరి ప్రశంసలకు అర్హుడు అయ్యాడు. తన తల్లిదండ్రులను రిక్షాపై కూర్చోబెట్టి ఎర్రటి ఎండలో కష్టపడుతున్న ఆ బాలుడిని చూసిన ఎంతోమంది ప్రయాణికులు చలించిపోయి కాస్తో కూస్తో డబ్బులను దానం చేశారు. ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రుల బాధ్యత తన భుజాలపై వేసుకొని ఇంటికి చేర్చిన తబారే ఆలంను ప్రస్తుతం అందరూ తెగ కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: