దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించిపోయాయి. లాక్ డౌన్ వల్ల అత్యాచారాలు, హత్య కేసులు తగ్గుముఖం పట్టినా సైబర్ నేరాలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మందికి వాట్సాప్ లో కొత్త నంబర్ల నుంచి వీడియో కాల్స్ ఉన్నాయి. ఫోన్ కాల్ లో అటువైపు నుంచి నగ్నంగా ఉన్న అమ్మాయి హాయ్ అంటూ పలకరిస్తుంది. 
 
 
అవతలి వైపు అమ్మాయి తాను లాక్ డౌన్ లో నగ్నంగా ఉన్నానని... మీరు కూడా అలానే ఉన్నారా...? అంటూ పలకరిస్తుంది. సైబర్ నేరగాళ్లు తాజాగా అమాయకులను మోసం చేయటానికి ఈ నయా మార్గాన్ని ఎంచుకున్నారు. సైబర్ నేరగాళ్లు అమ్మాయితో మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ నగరం నుంచి ఇలాంటి కేసులు 40 నమోదు కావడం గమనార్హం. 
 
ఫిర్యాదు చేయని వారి సంఖ్య కూడా భారీగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సికింద్రాబాద్ లో నివాసం ఉంటున్న ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు వారం రోజుల క్రితం వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ లో ఒక యువతి నగ్నంగా తన పేరు వివరాలు తెలిపింది. కొన్ని గంటల తరువాత సైబర్ నేరస్థులు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి 5 లక్షలు ఇస్తే వీడియో డిలేట్ చేస్తామని బెదిరించారు. 
 
సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీకి చెందిన ముఠాలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ తరహా వీడియో కాల్స్ కు స్పందించవద్దని చెబుతున్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో వీడియోలు ఉంచుతామని బెదిరించినా గట్టిగా మాట్లాడాలని సూచిస్తున్నారు. ఎవరికైనా వీడియో కాల్ వస్తే 94906 16555 నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: