విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్రప్రభుత్వం..  వందే భారత్ మిషన్‌ చేపట్టినా కొన్ని దేశాలను ఆ జాబితాలో చేర్చకపోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ దేశాల్లో ఉండే ప్రవాసులు అంతర్జాతీయ విమాన సర్వీసులు లేకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. తమను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

 

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా.. ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు వెనక్కి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారిని తీసుకొచ్చేందుకు కేంద్రం తాజాగా వందే భారత్‌ మిషన్‌ చేపట్టింది. అమెరికా, కెనడా, కజికిస్తాన్, సౌదీ అరేబియా సహా సుమారు 40 దేశాల నుంచి... వివిధ పనుల పై వెళ్లిన భారతీయుల్ని వెనక్కి రప్పించింది. అయితే మెక్సికో వంటి కొన్ని దేశాలు మాత్రం వందేభారత్‌ మిషన్‌ జాబితాలో లేవు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు నడిచే ప్రత్యేక విమానాలు కూడా అటుగా వెళ్లే అవకాశం లేదు. 

 

సెకండ్‌ ఫేజ్‌లోనైనా అవకాశం వస్తుందనుకున్నారు మెక్సికోలో చిక్కుకున్న భారతీయులు. కానీ, ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ఈ దేశానికి వివిధ పనులపై వెళ్లిన సుమారు 220 మంది భారతీయులు చిక్కుకుపోయారు. గత రెండు నెలల నుంచి స్వదేశం రాలేక, అక్కడ ఉండలేక  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

 

మెక్సికోలో ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోంది. సుమారు 57వేల మంది వైరస్‌ బారిన పడగా, ఆరువేల మందికిపైగా చనిపోయారు. డెత్‌ రేట్‌ ఎక్కువగా ఉన్న దేశాల్లో మెక్సికో కూడా ఒకటి. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు.. వారికోసం స్వదేశంలో ఉన్న కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం చొరవ చూపి.. తమను కాపాడాలని కోరుతున్నారు. 

 

అయితే, కేంద్రం నుంచి స్పష్టత లేకపోవటంతో.. అక్కడ ఉన్న భారతీయ ఎంబసీ వాళ్లు ఏమీ చేయలేని పరిస్తితి. ఎప్పుడు విమాన సర్వీసులు ఏర్పాటు చేయబోతున్నారనే సమాచారం ఇవ్వలేకపోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: