చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే చైనాలోని వుహాన్ నగరాన్ని లాక్ డౌన్ చేసిన తరువాత అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి ఫాంగ్ ఫాంగ్ అనే రచయిత్రి పూర్తి వివరాలతో ఒక డైరీ రాశారు. చైనా అత్యున్నత సాహితీ పురస్కారం పొందిన ఫాంగ్ ఫాంగ్ లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఆన్ లైన్ డైరీ రాయడం మొదలుపెట్టారు. 
 
ఫాంగ్ ఫాంగ్ తన డైరీలో రాజకీయంగా సున్నితమైన అంశాల గురించి సైతం ప్రస్తావించారు. వుహాన్ లో లాక్ డౌన్ అమలు చేసిన సమయంలో మాస్కుల కొరత ఉండేదని... ఆస్పత్రులు నిండిపోవడంతో కొత్త రోగులను ఇంటికి పంపించారని... తన సన్నిహితుల మరణాల గురించి కూడా ఆమె డైరీలో ప్రస్తావించారు. తన వైద్య మిత్రుల్లో ఒకరు వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని ముందుగానే చెప్పారని ఆ విషయం ఉన్నతాధికారులకు వెల్లడించినా వారు ప్రజలను హెచ్చరించలేదని ఆమె అన్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో అభిమానులు ఉన్న ఫాంగ్ ఫాంగ్ రాసిన డైరీ ప్రస్తుతం ఇంగ్లీష్ లోకి అనువాదమవుతోంది. ప్రస్తుతం ఆమెపై చైనా దేశ ద్రోహానికి సంబంధించిన కేసు పెట్టాలని అక్కడ పబ్లిక్ డిమాండ్ చేస్తోంది. వుహాన్ లో రోజువారీ జీవితాన్ని వెలుగులోకి తీసుకొఛారనే కారణంతో ఆమెపై దేశ ద్రోహం నమోదు చేయాలని చర్చ జరుగుతోంది. నిబోలో ఆన్ లైన్ డైరీ పేరుతో ఆమె డైరీ రాసింది. 
 
ఈ డైరీలో బలవంతంగా ఐసోలేషన్ లో పెట్టడం దగ్గరి నుంచి ప్రతి విషయాన్ని ఆమె డైరీలో ప్రస్తావించారు. ఆమె లాక్ డౌన్ పరిస్థితులను యథాతథంగా రాయడంతో ఆమె డైరీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. చైనాలో ధనవంతుల విషయంలో ఒకలా సాధారణ వ్యక్తుల విషయంలో మరోలా వ్యవహరించారని ఆమె డైరీలో ఆరోపణలు చేయడంతో పాటు ఆహారం విషయంలో బేధాలు చూపించారని పేర్కొంది. అమెరికా చైనా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో చైనా రహస్యాలను ఫాంగ్ ఫాంగ్ బయటపెట్టిందని ఆమెపై దేశద్రోహం కేసు పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: