ఛత్తీస్ గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి ఈరోజు మధ్యాహ్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన గుండె పోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన అజిత్ జోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అజిత్ జోగి 1946 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన జన్మించారు. భూపాల్ లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీస్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బంగారు పతకం సాధించారు. 
 
ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో విద్యార్థుల సంఘానికి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో కొంతకాలం పని చేసిన ఆయన 1974లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌, సిద్ధి, శాహడోల్ జిల్లాలకు కలెక్టర్ గా, మెజిస్ట్రేట్ గా పని చేశారు. 2000 సంవత్సరం నవంబర్ నెల నుంచి 2003 డిసెంబర్ వరకు ఛత్తీస్ గడ్ తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు. 
 
అనంతరం 2004 లోక్ సభ ఎన్నికల్లో ఛత్తీస్ గఢ్ లోని మహాసముంద్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 2009లో పోటీ చేసి అజిత్ జోగి విజయం సాధించారు. అయితే 2014లో మాత్రం అజిత్ జోగిని విజయం వరించలేదు. ఆయన మహాసముంద్ నియోజకవర్గంలో 133 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన చందులాల్ సాహు చేతిలో ఓడిపోయారు. అప్పటివరకు కాంగ్రెస్ తరపున పని చేసిన అజిత్ జోగి 2016లో ఛత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. 
 
మెకానికల్ ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన అజిత్ జోగి "ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ క‌లెక్ట‌ర్", "అడ్మినిస్ట్రేష‌న్ ఆఫ్ ఫెరిఫ‌ర‌ల్ ఏరియాస్" పేర్లతో రెండు పుస్తకాలను రచించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అజిత్ జోగిని అతని కుమారుడు అమిత్ జోగిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. 2003 నాటి ఎన్సీపీ నేత హత్యకేసులో జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగిని 2007లో సీబీఐ అరెస్ట్ చేసింది. అమిత్ జోగి మృతితో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: