దేశంలో కరోనా ఉగ్ర రూపం దాలుస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడచిన 24 గంటల్లో నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,00,000 దాటగా కరోనా మృతుల సంఖ్య 5,800 దాటింది. దేశంలో ఇప్పటివరకు కరోనా వ్యాధిగ్రస్తులకు ఐసోలేషన్ లో, అనుమానితులకు క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందించడం లేదా పరీక్షలు చేయడం చేస్తున్నారు. 
 
అయితే ప్రస్తుతం కరోనా రోగులకు కూడా పలు రాష్ట్రాల్లో హోం క్వారంటైన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఐదో విడత లాక్ డౌన్ లో భారీగా సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,00,000 దాటడంతో... కేవలం 15 రోజుల్లో లక్ష కేసులు నమోదు కావడంతో.... ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
నిబంధనలు సడలించడం, భారీ స్థాయిలో రాకపోకలు ప్రారంభమవడం కరోనా వైరస్ విజృంభించడానికి కారణమవుతోంది. లక్షణాలు కనిపించని కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఈ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఇతర రాష్ట్రాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. 
 
ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో దాదాపు 50,000 కేసులు నమోదయ్యయి. కాంటాక్ట్ ట్రేసింగ్ లేని కేసుల వల్ల ఈ ఆరు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కేసుల సంఖ్య పెరగడానికి ఎక్కువ రోజులు పట్టదని నిపుణుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: