కశ్మీర్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అప్పటివరకు తనతో కలిసి నడిచి కబుర్లు చెప్పిన తాత అకస్మాత్తుగా కింద పడిపోయాడు. తాత శరీరం నుంచి రక్తం ధారలుగా కారుతోంది. మూడేళ్ల వయస్సున్న బాలునికి తాతకు ఏమైందో అర్థం కాలేదు. ‘ఏమయ్యింది... లే తాత లే... ఇంటికి వెళ్దాం తాత ’ అంటూ బాలుడు వెక్కివెక్కి ఏడుస్తూ ఉండటం స్థానికులను కలచివేసింది. ఆ పసివాడిని చూసి ప్రతి ఒక్కరు అయ్యో అంటున్నారు. 
 
కశ్మీర్ లోని సోపూర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రతా దళాలకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 60 సంవత్సరాల వృద్ధుడికి బుల్లెట్లు తగలడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఈ విషయం తెలియని వృద్ధుడి మూడేళ్ల మనవడు కన్నీరుమున్నీరయ్యాడు. ఈరోజు ఉదయం జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో భద్రతా దళాలకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
కాల్పులు జరుగుతున్న సమయంలో అదే మార్గంలో తాతామనవడు వెళుతుండగా దురదృష్టవశాత్తు తాతకు రెండు బుల్లెట్లు తగిలాయి. ఏం జరిగిందో తెలీని ఆ పసివాడు చలనం లేని తాతను చూసి తాతపై కూర్చుని ఏడవడం ప్రారంభించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడిని ఓదార్చి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. 
 
ఒక ఫోటోలో పసివాడు తన తాతను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తుండగా.... మరో ఫోటోలో గోడ వెనక దాక్కున్న సైనికుడు ఒకరు ఆ పసివాడికి సూచనలు చేయడం... ఆ పసివాడు అక్కడినుంచి వెళ్లిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈరోజు ఉదయం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో వృద్ధుడితో పాటు సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడని సమాచారం. మరో ముగ్గురు సైనికులు ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలయ్యారని తెలుస్తోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: