భారత్ లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాగా నేడు 20,000కు అటూఇటుగా నమోదవుతున్నాయి. ఇదే సమయంలో కరోనా మహమ్మారి నుంచి కోలుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనా రోగుల రికవరీ రేటు 60.73 శాతానికి పెరిగింది. 
 
గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 20,333 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,79,891 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా ప్రస్తుతం 2,27,439 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 60 శాతం దాటడం ఇదే తొలిసారి. మరోవైపు వైరస్ ను కొంతమేర నియంత్రించే మందులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. 
 
అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 1000కు పైగా కేసులు నమోదు కావటం గమనార్హం. మరోవైపు కొందరిలో కరోనా లక్షణాలు కనిపిస్తోంటే కొందరిలో కరోనా లక్షణాలు కనిపించటం లేదు. దేశంలో లక్షణాలు కనిపించని కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్రం లక్షణాలు కనిపించని వారి కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
లక్షణాలు లేకుండా కరోనా సోకిన బాధితులు హోం ఐసొలేషన్ లో ఉండాలని సూచించింది. ఇప్పటికే ప్రమాదకర వ్యాధులతో బాధ పడుతున్న వాళ్లు మాత్రం ప్రభుత్వ ఐసోలేషన్ లో చికిత్స పొందాలని సూచించింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి హోం ఐసోలేషన్ లో ఉంచాలని ప్రభుత్వాలకు తెలిపింది. హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లకు కేంద్రం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేయనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: