ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ప్రతి జిల్లాలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ రాష్ట్రంలో వైరస్ ను నియంత్రించడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 
 
తాజాగా జగన్ సర్కార్ రాష్ట్రంలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పెళ్లిళ్లకు ఎంతమందిని అనుమతించాలనే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రాష్ట్రంలో పెళ్లి జరిపించాలంటే కలెక్టర్ నుంచి అనుమతి పొందాల్సి ఉండేది. ప్రస్తుతం ఆ బాధ్యతలను తహశీల్దార్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నుంచి జీవో విడుదలైంది. జులై 21 నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుండడంతో రాష్ట్రంలో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాసం ఉంది. 
 
పెళ్ళిళ్లకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో పెళ్లిళ్లకు మాత్రమే తహశీల్దార్లు అనుమతులు ఇవ్వాలని.... ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వకూడదని పేర్కొంది. ప్రభుత్వం కేవలం 20 మంది బంధుమిత్రులు మాత్రమే పెళ్లికూతురు పెళ్లికొడుకు వైపు నుంచి పెళ్లిళ్లకు హాజరు కావాలని నిబంధనల్లో స్పష్టం చేసింది. 
 
గతంలో 50 మందికి పెళ్లిళ్లకు హాజరు కావడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్యను కుదించింది. పెళ్లిళ్లకు అనుమతులు కోరేవాళ్లు తప్పనిసరిగా వివాహ శుభలేఖతో పాటు, నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పై అఫిడవిట్ ను తహశీల్దార్ కు సమర్పించాలని.... దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తో పాటు, కరోనా పరీక్షలు చేయించుకున్నట్టుగా వైద్యులు ఇచ్చిన ధ్రువపత్రాలను, జతచేయాలని... నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.             

మరింత సమాచారం తెలుసుకోండి: