కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో పరిస్థితులు మారిపోయాయి. దేశంలోని సాఫ్ట్ వేర్, ఇతర రంగాల్లోని ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా విజృంభణ తగ్గినా పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగుల పనితీరు మెరుగుపడిందని... భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ను కొనసాగిస్తామని చెబుతున్నాయి. 
 
ఇదే సమయంలో ఉద్యోగులు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే మొగ్గుచూపుతున్నారు. మన దేశంలో 88 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతో సౌకర్యంగా ఉందని చెప్పినట్లు యస్‌ఏపీ కాంకర్‌ సర్వే తెలిపింది. ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని చెబుతున్నారని.... 300 కంపెనీల ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి సర్వే ఫలితాలను ప్రకటించింది. ఇంటి నుంచి పని చేస్తే ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. 
 
ఇంటి నుంచి పని చేయడం వల్ల కంపెనీలకు ఖర్చు తగ్గుతుందని సర్వే తన నివేదికలో పేర్కొంది. వర్క్‌-ఫ్రమ్‌-హోమ్‌ అవకాశాన్ని కల్పించిన కంపెనీలు ఉద్యోగులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో పాటు ఇంటర్నెట్‌, మొబైల్‌ రీఛార్జ్, ల్యాప్ టాప్స్ లాంటి సదుపాయాలను కూడా కల్పించినట్లు తెలుస్తోంది. 11 శాతం మంది ఉద్యోగులు మాత్రం ఆఫీస్ లో పని చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. 
 
కంపెనీలో అయితే హై స్పీడ్ డేటా ఉంటుందని, టీమ్ వర్క్ ఉంటుందని, స్నేహితులు ఉంటారని... అందువల్ల ఆఫీస్ లో ఎంతో సౌకర్యంగా ఉంటుందని వాళ్లు చెబుతున్నారు. ఒక శాతం ఉద్యోగులు మాత్రం తాము ఇంటినుండైనా, ఆఫీస్ నుండైనా పని చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఆప్షన్ ను కల్పించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: