మత ప్రచార సంస్థ తబ్లిగీ జమాత్‌ కు సంబంధించి... వివిధ నగరాల్లో ఉన్న కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు చేసింది. ఆ సంస్థ నాయకుడు మౌలానా సాద్‌ కంధల్వితో పాటు, వివిధ ట్రస్టులపై మనీ లాండరింగ్‌ కేసులు నమోదు కావడంతో... దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ అధికారులు  పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు.

కరోనా ఉధృతి మొదలు కాకముందు.. దేశవ్యాప్తంగా కలకలం రేపిన తబ్లిగీ జమాత్‌... మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మత ప్రచార సంస్థపై నమోదైన మనీలాండరింగ్‌ కేసులో.. ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేసింది. కీలక ఆధారాలు సేకరించినట్టు తెలిసింది.

కేరళ, దిల్లీ, ముంబై సహా హైదరాబాద్‌లోని తబ్లిగీ జమాత్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది ఈడీ. నిబంధనలకు వ్యతిరేకంగా ఆ సంస్థకు విదేశాల నుంచి నిధులు వచ్చినట్టు ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు... హైదరాబాద్‌లోని మల్లేపల్లి, టోలిచౌకి, మలక్‌పేట ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల నుంచి  కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ పోలీసులు మర్కజ్‌ చీఫ్‌ మౌలానాపై కేసు నమోదు చేయగా.. ఆ తర్వాత ఈడీ రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రపంచ దేశాల నుంచి తబ్లిగీ జమాత్‌కు విరాళాల రూపంలో వచ్చిన నిధులు నిబంధనలకు విరుద్ధంగా సొంత ఖాతాలకు బదిలీ చేశారని ఈడీ గుర్తించింది. దీంతో ప్రీవెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ కింద మౌలానా సాద్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్‌తో పాటు హవాలా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. కేసు దర్యాప్తులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.

మొత్తానికి మత ప్రచార సంస్థ తబ్లిగీ జమాత్ కు సంబంధించిన వివిధ కార్యాలయాల్లో ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: