ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు సచివాలయ ఆరోగ్య సహాయకులను సచివాలయ ఆరోగ్య మిత్రలుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సచివాలయ ఆరోగ్య మిత్రలు ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాలను మానిటర్ చేస్తారని ప్రభుత్వం పేర్కొంది. ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ సిఫార్సులను అనుసరించి వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఈ నిర్ణయం వెలువడింది.
 
సచివాలయ ఆరోగ్య మిత్రలు రోగుల దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యశాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు ప్రజలకు వాటి గురించి అవగాహన కల్పించాలి. ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్య మిత్రలు లబ్ధిదారులను పంపించాలి. నగదు రహిత చికిత్సకు సహకరించాలి. ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన సహాయసహకారాలు అందించాలి.
 
ఆరోగ్య క్యాంపులలో ఖచ్చితంగా పాల్గొనాలి. సచివాలయ ఆరోగ్య మిత్రలు, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు జిల్లా కోఆర్డినేటర్లకు ప్రతిరోజూ చేసే కార్యకలాపాలకు సంబంధించిన రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. నూతనంగా జారీ చేసిన ఈ మార్గదర్శకాలతో పాటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాను అందుబాటులో ఉంచాలి. వైద్యారోగ్యశాఖ నుంచి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించే విధంగా ఆరోగ్యశ్రీ ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోంది. 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వారికి కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ ఏపీ ప్రజలు వైద్య సేవలు పొందేలా జగన్ సర్కార్ ఏర్పాట్లు చేసింది. జగన్ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: