కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆదాయం భారీగా పడిపోయినందున దాన్ని పూడ్చుకునేందుకు నాచురల్ గ్యాస్ ధరలను పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్‌లో ఆదాయం 4వేల 480 కోట్లు రాగా… ఈసారి కరోనా వల్ల ఏప్రిల్‌లో కేవలం 1323 కోట్లు మాత్రమే వచ్చిందని జీఓలో వివరించింది. మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లోనూ అదే పరిస్థితి ఉందని వివరించింది. అందుకే నాచురల్ గ్యాస్‌పై టాక్స్‌ను 14.5 శాతం నుంచి 24.5 శాతానికి పెంచుతున్నట్టు ప్రభుత్వం జీఓలో వివరించింది. ఈ జీఓని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నాయి. టీవీ చానళ్లలో ఏపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచేసిందని, ఎల్‌పీజీ సిలిండర్ రేటు పెరిగిందంటూ కథనాలను ప్రసారం చేశారు.ఈ ప్రచారం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరపున స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్ ప్రకటన విడుదల చేశారు. ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెంచారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని ఆయన వివరణ ఇచ్చారు. ప్రభుత్వం స్వల్పంగా ట్యాక్స్ పెంచింది సహజవాయువుపై అని… దీన్ని పరిశ్రమల్లో, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో వాడుతుంటారని వివరణ ఇచ్చారు. వంట గ్యాస్ ధరలను పెంచలేదని వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాల్లో అవగాహన చేసుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రజత్ భార్గవ్ తన ప్రకటనలో అభ్యంతరం తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్ రేటులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి