బీహార్ దంగల్ వేడెక్కుతోంది. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ అక్టోబరు 28న, రెండోదశ నవంబరు 3న, ఇక చివరిదైన మూడోదశ నవంబరు 7న ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ కోవిడ్ నిబంధనలను సడలించింది. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. దీంతో పోటాపోటీకా పార్టీలు అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తూ.. రేసు గుర్రాలను రంగంలోకి దింపుతున్నాయి.
తాజాగా భారతీయ జనతా పార్టీ రెండో దశ పోలింగ్ జరిగే 46 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న నంద కిశోర్, మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా తనయుడు నితీష్ మిశ్రా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 110 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలబెడుతోంది. 11 సీట్లను వీఐపీకి కేటాయించింది. ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీయూ 115 సీట్లలో పోటీ చేస్తుండగా, జితన్ రాం మాంఝీకి చెందిన హెచ్ఏఎంకి ఏడు సీట్లు ఇచ్చింది.
బీహార్ సురక్షితంగా ఉండాలంటే అధికారం నితీష్ కుమార్ చేతిలో ఉండాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బాధ్యత తమదేనని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. పాట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈసారి ఎన్నికల్లో ఎన్సీపీ కూడా బరిలోకి దిగుతోంది. ఎన్నికల ప్రచారం కోసం 40 మందితో కూడిన ముఖ్య ప్రచారకర్తల జాబితానూ ఇప్పటికే రూపొందించింది. బిహార్ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు శరద్ పవారే ఎన్సీపీ ప్రచారంలో కీలకంగా ఉండనున్నారు. మరోవైపు బిహార్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెడుతున్న శివసేన.. 20 మందితో స్టార్ క్యాంపెయినర్ లిస్టు రూపొందించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి