తెలంగాణలో కేంద్రం బృందం రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. నిన్న హైదరాబాద్‌, సిద్ధిపేటలో పర్యటించి వరద నష్టంపై అంచనా వేసింది సెంట్రల్‌ టీమ్. వరదలతో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.

భారీ వర్షాలతో అల్లాడిపోయిన  గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ వశిష్ట నేతృత్వంలో రాష్ట్రానికి ఐదుగురు సభ్యులతో కూడిన వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారుల బృందం వచ్చింది. వివధ శాఖల అధికారులతో కలిసి ఇప్పటికే ఓల్డ్‌ సిటీలో పర్యటించింది. వరద తాకిడికి అల్లాడిన కాలనీలు, బస్తీలు, తెగిన చెరువులు, నాలాలను పరిశీలించారు.

కేంద్ర బృందంలోని మరో ఇద్దరు అధికారులు రాష్ట్రంలోని ఇతర జిల్లాల సందర్శనకు వెళ్లారు. ఆర్బీ కౌల్‌, కె.మనోహరన్‌.. సిద్దిపేట జిల్లా ములుగు, మర్కుక్‌ మండలాల్లో పంటనష్టాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి వారికి వివరాలు తెలిపారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 84,159 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. దాదాపు రూ.423 కోట్ల పంట నష్టం వాటిల్లిందని వివరించారు. కేంద్ర బృందం సభ్యులు పలువురు రైతులతో మాట్లాడి వివరాలను సేకరించారు.

మరోవైపు కేంద్ర బృందం పర్యటన మొదటి రోజు చార్మినార్‌ జోన్‌ పరిధిలోని ప్రాంతాల్లో జరిగింది. చాంద్రాయణగుట్టకు వెళ్లిన అధికారులు ఫలక్‌నుమా వద్ద దెబ్బతిన్న ఆర్‌వోబీని, పక్కనే ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. పల్లె చెరువు తెగడంతో 12-15 అడుగుల మేర వరద ప్రవహించిందని, మొదటి అంతస్తుల్లోకీ నీళ్లు వచ్చాయని, కట్టుబట్టలతో మిగిలామని అధికారులకు స్థానికులు వివరించారు. ఇప్పటికీ ఇళ్లలో నీళ్లు ఉన్నాయని, రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

పల్లె, గుర్రం చెరువులు తెగిపోవడంతో బాలాపూర్‌ చెరువు పొంగిపొర్లిందని, పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని స్థానిక అధికారులు వివరించారు. హఫీజ్‌బాబానగర్‌ కాలనీలో ఇళ్లను వరద ముంచెత్తడంతో ప్రహరీ గోడలు కూలాయని, ఇళ్లలోని ఫర్నిచర్‌, నిత్యావసర వస్తువులు పాడయ్యాయని స్థానికులు చెప్పారు. గగన్‌పహాడ్‌ వద్ద అప్పా చెరువును పరిశీలించిన అధికారులకు స్థానికులు అక్కడి పరిస్థితిని వివరించారు.  చెరువుకు గండి పడడంతో నాలాలో ప్రవాహ ఉధృతి పెరిగి కాలనీల్లో ఇళ్లు ముంపునకు గురయ్యాయని, పలు వాహనాలు వరదలో కొట్టుకుపోయాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: