దుబ్బాక ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ పై దృష్టి పెట్టారు అధికారులు. దుబ్బాకలో స్థానికేతరులు ఎవరూ లేకుండా చూస్తున్నారు. కొద్దిరోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో.. భారీగా బలగాలను మోహరించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు ఎన్నికల కమిషన్ తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ ఠాకూర్‌ను పంపించింది.
దుబ్బాక నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య ఒక లక్షా 98 వేల 807. వీరిలో మహిళలు ఒక లక్షా 779 మంది కాగా.. పురుషులు 98వేల 28 మంది. దుబ్బాకలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 315. కరోనా కారణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు అధికారులు. కరోనా ప్రోటోకాల్ లో భాగంగా.. సీనియర్ సిటిజన్లకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం కల్పించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సోషల్ డిస్టెన్స్ నిబంధన పాటిస్తామని, ఏఎన్ఎమ్ అందుబాటులో ఉంటారని, గ్లౌజులు ఇస్తామని తెలిపారు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నవారికి స్లిప్పులు ఇచ్చి.. చివరి గంటలో ఓటింగ్ కు అనుమతి ఇస్తామని చెప్పారు అధికారులు.
రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతుంది. నవంబర్ 10న కౌంటింగ్ ఉంటుంది. కోవిడ్ కారణంగా పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచారు అధికారులు. మాస్క్ లేకుండా ఓటు వేయడానికి ఎవరినీ అనుమతించరు. గత ఎన్నికల్లో 86 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తానికి దుబ్బాకలో మైకులు మూగబోయాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓ రేంజ్ లో హంగామా సృష్టించాయి. అయితే రేపు ఉపఎన్నిక జరుగనుండటంతో తెలంగాణలోని అందరి దృష్టీ దుబ్బాకపైనే ఉంది. అధికార పార్టీ గెలుస్తుందో లేక ప్రతిపక్ష పార్టీ గెలుస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి