పరిపాలన సౌలభ్యం కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే జగన్, తన పాదయాత్ర సమయంలోనే ఒక్కో పార్లమెంట్‌ని ఒక్కో జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ఆ దిశగానే వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం మొత్తం 25 జిల్లాలుగా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు అది కాస్త 32 జిల్లాలుగా మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరిపాలన సౌలభ్యం కోసం జగన్ 13జిల్లాలతో పాటు మరో 19 జిల్లాలని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగు జిల్లాలలో విస్తరించి ఉన్న అరకు పార్లమెంట్‌ని మూడు జిల్లాలుగా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ జిల్లాల విభజన అంత తేలికగా అయ్యే వ్యవహారంలా కనిపించడం లేదు. జిల్లాల విభజన సమయంలో ప్రాంతాల మధ్య ఇబ్బందులు రావొచ్చు. ఆ ఇబ్బందులని తొలగించడానికి జగన్, ప్రధాన కార్యదర్శితో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు.

ఈ కమిటీకి ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులు తమ అభ్యంతరాలని చెప్పొచ్చు. అయితే ఈ జిల్లాల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. జిల్లాల విషయంలో రోజుకో డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని పలువురు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం గుంటూరు జిల్లా గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, అమరావతి జిల్లాలుగా ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయి.

వీటిల్లో పక్కనే ఉన్న కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అయితే పల్నాడు ప్రాంత నేతలు చేస్తున్న డిమాండ్ ఏంటంటే, గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాని ఏర్పాటు చేయాలని ఆందోళన చేయడం మొదలుపెట్టారు. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు... గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ వినహా అన్ని రాజకీయ పార్టీలు గురజాల జిల్లా కేంద్రం కావాలని డిమాండ్ చేస్తున్నాయని చెబుతున్నారు. మరి చూడాలి ఈ జిల్లాల విభజన రగడ జగన్ ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: