తమిళనాడులో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సూపర్ స్టార్ రజిని రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్దమయింది. తాను కొత్త పార్టీ పెడతానని, వివరాలు డిసెంబర్ 31న  తెలియ చేస్తానంటూ ఆ ట్వీట్ లో ఆయన ప్రస్తావించారు. దాంతో అభిమానులు రజిని తమకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 


సినిమా నటులు రాజకీయాలను శాసించే ఆనవాయితీ అత్యధికంగా ఉన్న తమిళనాడు పాలిటిక్స్ లోకి రజిని ఎప్పుడు ప్రవేశిస్తాడా? అని వొళ్ళంతా కళ్ళు చేసుకుని ఆయన అభిమాన జనం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించే తరుణం ఆసన్నమైనదని రజిని చేసిన ఓ ట్వీట్ చెబుతోంది.

 ఎన్నికల సమయాల్లో ఎప్పటికప్పుడు రజిని ఎంట్రీకి సంబంధించి చర్చోపచర్చలు సుదీర్ఘంగా సాగుతుండడం...నేడో, రేపో వస్తానన్నవేళకి ఆయన వెనుకడుగు వేయడం జరుగుతోంది. అయితే, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కాలంలో ఇన్నాళ్ళకి మళ్ళీ రజిని ఎంట్రీ పై ఆశలు మొలకెత్తాయి. దాంతో, ఇటీవల చెన్నయి లోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో రజిని సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు కొంతమంది అభిమానులు రజిని ఇంటికి చేరుకొని రాజకీయాల్లోకి ఆయన్ని స్వాగతిస్తూనే కమలం పార్టీతో సయోధ్య ఉండకూడదంటూ షరతు పెట్టారు. అలాగయితేనే రజిని రాజకీయాల్లోకి రావాలని వారు సూటిగా స్పష్టం చేశారు. ఆ తర్వాత అభిమానులను కలుసుకున్న రజిని వారి సలహాలు, సూచనలను శ్రద్దగా విని తన అభిప్రాయాన్ని త్వరలోనే ప్రకటిస్తానంటూ చెప్పారు. 


తాజాగా రజిని ఈ సార్వత్రిక ఎన్నికల్లో పాలు పంచుకునేందుకుగాను కొత్త పార్టీ పెడతానంటూ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. పార్టీకి సంబంధించి మిగతా వివరాలు డిసెంబర్ 31 న ప్రకటిస్తానంటూ తెలిపారు. రజిని ట్వీట్ తో తమిళనాట పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం మొదలైనది. అయితే, రజిని స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ అభిమానులు కోరుతున్నారు. కమలం పార్టీ కానీ, మరీ ఇతర పార్టీలతో కలవొద్దని వారు సూచిస్తున్నారు. రజిని పొలిటికల్ జర్నీ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే డిసెంబర్ 31 వరకూ ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: