గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. టీఆర్‌ఎస్‌ పార్టీ.. అధిక స్థానాలు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. మజ్లిస్‌ పార్టీ.. పాతబస్తీలో తన పట్టు నిలుపుకొంది. 2016 బల్దియా ఎన్నికలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌కు సీట్లు భారీగా తగ్గగా.. కమలం పార్టీ రికార్డు స్థాయిలో పుంజుకుంది. అసలు.. 2016 నుంచి 2020 నాటికి బల్దియా ఎన్నికల్లో వచ్చిన మార్పులేమిటో తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

తాజాగా జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో మొత్తంగా 74లక్షల 67వేల 256 ఓట్లర్లు ఉండగా.. కేవలం 34లక్షల 50వేల 331 ఓట్లు పోలయ్యాయి. అంటే పోలింగ్‌ శాతం 46.55గా నమోదైంది. మొత్తంగా 1122 మంది బరిలో నిలవగా.. 2016 ఎన్నికలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌కు భారీ షాకే తగిలింది. గ్రేటర్‌లో ఆ పార్టీకి గతంలో 99 స్థానాలు గెలవగా.. ఆ సంఖ్య ఇప్పుడు 55కి పడిపోయింది. ఎంఐఎం.. 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి తన కోటను పదిలపర్చుకుంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో జీహెచ్‌ఎంసీ బరిలోకి దూకిన భాజపా.. అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 48 డివిజన్లలో కాషాయ జెండాను ఎగురవేసి సత్తా చాటింది. గతంలో నాలుగు స్థానాలు గెలిచిన కమలం పార్టీ.. ఈ సారి 48 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌పార్టీ ఈసారి కూడా కేవలం రెండు స్థానాలకే పరిమితమై ఘోర పరాభవాన్నే చవిచూసింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత జీహెచ్‌ఎంసీకి 2016లో జరిగిన ఎన్నికల్లో.. టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయం సాధించి గ్రేటర్‌ పీఠం కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం 45.25గా నమోదైంది. అప్పుడు 13వందల33 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అప్పుడు 150 స్థానాల్లో పోటీచేసిన టీఆర్‌ఎస్‌.. 99 స్థానాలు సాధించి రికార్డు సృష్టించింది. అప్పుడు కూడా 149 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌.. రెండు స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో  బీజేపీ, టీడీపీ.. కూటమిగా పోటీ చేశాయి. 95 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ ఒక్క స్థానం గెలుచుకోగా.. 55 స్థానాల్లో బరిలో దిగిన బీజేపీ నాలుగు స్థానాల్లో గెలించింది.

అంతకు ముందు, 2009లో జరిగిన గ్రేటర్ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ దూరంగా ఉంది. 52 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌, 43 స్థానాలు గెలిచిన ఎంఐఎంతో కలిసి మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: