కర్నూల్ జిల్లాలో నందికొట్కూరు నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడ ఫ్యాక్షన్ పోరు మామూలుగా ఉండదు. గత 10 సంవత్సరాల ముందు వరకు ఎన్నో రాజకీయ హత్యలు  జరిగాయి. కానీ అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే వారిదే రాజ్యం. అయితే ప్రస్తుతం అప్పటికీ ఇప్పటికీ ఎన్నో పరిస్థితులు మారాయి. ప్రజలలో చైతన్యం వచ్చింది. ఎవరి స్వార్థం కోసమో హత్యలు చేసే విధానానికి స్వస్తి పలికారు. దీనికి నిదర్శనమే మొన్న ముగిసిన నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని  గ్రామ పంచాయతీ ఎన్నికలు. ప్రతి గ్రామంలో కూడా ఓటర్లు అంతా కూడా వారికి మంచి చేసే నాయకుడికి తమ ఓట్లు వేసి గెలిపించుకున్నారు.

ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం నగర మునిసిపాలిటీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇక్కడ అంతిమ పోరు మాత్రం వైసీపీ మరియు టీడీపీలకు మధ్యనే ఉండనుంది.  ఇక్కడ టీడీపీ కి గతంతో పోలిస్తే కొంచెం బలం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే గత రెండు సార్వత్రిక ఎన్నికలలో కూడా వైసీపీ విజయ కేతనం ఎగరవేసింది. స్థానికంగా వైసీపీ కి అండదండగా ఉండి ముందుకు నడిపిస్తున్న  యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. గత ఎన్నికలలో వైసీపీ ఇక్కడ గెలిచిందంటే  కారణం ఈ యువ ప్రభంజనమే. 2019 లో ఇక్కడ ఎమ్మెల్యే సీటు దళితులకు రిజర్వ్ అవ్వడంతో, వైసీపీ తరపున ఆర్థర్ అనే క్రైస్తవ మతస్తుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. ఈయన గెలుపుకు ప్రతిక్షణం ముందుండి అఖండ మెజారిటీతో ఆర్థర్ ను గెలిపించాడు. అయితే గత కొంత కాలంగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కు మరియు యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే వీరిద్దరూ మీడియా ముందు మాత్రం మా మధ్య ఎటువంటి వివాదాలు లేవని చెబుతున్నా...అసలు నిజం ఏమిటో స్థానిక నాయకులకు తెలుసు. ఈ మనస్పర్థలే  ఇప్పుడు  వైసీపీ ని బలహీనం చేయనున్నాయి అంటూ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల్లో జరగబోయే నగర పాలక ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే గతంలో ఒకటి రెండు సార్లు సీఎం జగన్ వీరిద్దరినీ మందలించి కలిపే ప్రయత్నం చేసినా ఫలించినట్లు  లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తోంది. అయితే ఎన్నికల సందర్భంగా వీరిద్దరూ ఒకతాటిపైకి వచ్చి టీడీపీని ఓడిస్తారా..? లేదా ఇదే వివాదాలను కొనసాగిస్తూ వైసీపీ ఓటమికి కారణం అవుతారా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: