గత ఏడాది నుండి ప్రపంచ ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు మనల్ని వీడి వెళుతుందో అర్థం కాని పరిస్థితి. మహా మహా సైంటిస్టులు సైతం ఈ మహమ్మారి కనుమరుగయ్యే సమయం ఎప్పుడు అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కంటికి కనిపించని ఈ చీడ పురుగు ప్రజల ప్రాణాలను హరించేస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగా తొలి దశతో పోలిస్తే రెండవ దశ తీవ్రత చాలా ఎక్కువనే చెప్పాలి. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని తెలుస్తోంది. మరోవైపు రికవరీ రేటు కూడా పెరగడం ఆనందాన్ని కలిగించే విషయమనే చెప్పాలి.

గణాంకాల ప్రకారం కరోనా నమోదు సంఖ్య కంటే రికవరీ ఎక్కువగా ఉండడం సంతోషించాల్సిన విషయం. అయితే కరోనా మరణాల సంఖ్య గత వారంతో పోలిస్తే తగ్గుతున్నప్పటికీ  ఆశించిన రీతిలో మాత్రం మరణాల రేటు తగ్గటం లేదు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3847 మంది కరోనా పేషెంట్లు మరణించారు. రానురాను ఈ సంఖ్య బాగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,73,69,093 కి చేరగా, వీరిలో ఇప్పటి వరకు 2,46,33,951 మంది రికవరీ అయ్యారు.  దేశంలో ఇప్పటివరకు 3,15,235 మంది కరోనా బాధితులు మరణించారు.

ఇప్పుడు కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్న మరో విషయం ఏమిటంటే ? దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడం ఆనందించదగ్గ విషయమే, కానీ ఇప్పుడే ప్రజలు అప్రమత్తం అవ్వాలి. లేదంటే విషయం మళ్లీ మొదటికి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు. పోయిన సారి కూడా కరోనా కాస్త తగ్గగానే ప్రజలు మళ్లీ యధావిధిగా రోడ్లపైకి రావడం మొదలుపెట్టారు. దానితో కరోనా తీవ్రత బాగా పెరిగి రెండవ దశ మొదలైంది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ పొరపాటు జరగకుండా ఉండాలంటే, కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ నిబంధనలు తప్పక పాటించాలి. దేశంలో 70 శాతం మందికి పైగా వ్యాక్సిన్ వేసుకునే వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.


అప్పుడే ఈ మహమ్మారి కట్టలు తెంచు కోకుండా ఉధృతి తగ్గుతుంది. కరోనా నియమాలను ప్రతి ఒక్కరు పాటించడం ద్వారా కరోనా చైన్ ను బ్రేక్ చేయవచ్చు. తద్వారా వాక్సినేషన్ పూర్తయ్యే  సమయానికంటే ముందుగానే ఈ వైరస్ కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గుర్తుంచుకుని జాగ్రత్త వహించాలి. అప్పుడే మనం - మన కుటుంబాలు - మన సమాజం బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: