ఆ సమయంలోనే తెలంగాణా ఉద్యమం పురుడుపోసుకుంది. ఆ ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమం గా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969, జనవరి 9 న ఖమ్మం పట్టణంలో బి.ఎ. స్టూడెంట్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడైన రవీంధ్రనాథ్ గాంధీచౌక్ దగ్గర నిరవధిక దీక్ష ప్రారంభించాడు. ఆరోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు జరిగాయి. మరుసటి రోజు ఉద్యమం నిజామాబాదుకు పాకింది. జనవరి 10 న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థుల సమావేశంలో - తెలంగాణా రక్షణల అమలుకై జనవరి 15 నుండి సమ్మె చెయ్యాలని ప్రతిపాదించారు. అయితే, జనవరి 13 న అదే విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో విద్యార్థులలోని ఒక వర్గం "తెలంగాణా విద్యార్థుల కార్యాచరణ సమితి"గా ఏర్పడి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే తమ ధ్యేయంగా ప్రకటించారు. జనవరి 18 న విద్యార్థుల్లోని రెండు వర్గాలు (తెలంగాణా రక్షణల కోసం ఉద్యమించిన వారు, ప్రత్యేక తెలంగాణా కోరేవారు) వేరువేరుగా హైదరాబాదులో ఊరేగింపులు జరిపారు. ఈ రెండు ఊరేగింపులు ఆబిద్స్ లో ఎదురైనపుడు ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీఛార్జి చెయ్యవలసి వచ్చింది. అదేరోజు శాసనసభలోని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా రక్షణల అమలు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడి చేసాయి.
ఉద్యమకారుల కోరికలను చర్చించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19 న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం కింది విధంగా ఒక ఒప్పందానికి వచ్చింది. అవేవి అంటే..తెలంగాణాలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించాలి. పెద్దమనుషుల ఒప్పందం లోని తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలి. అయితే ప్రత్యేక తెలంగాణా వాదులు ఈ ఒప్పందానికి సమ్మతించలేదు. ప్రత్యేక రాష్ట్రమే తమ ధ్యేయమని, అది నెరవేరేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు. అఖిలపక్ష కమిటీ ఒప్పందాన్ని అమలు చేస్తూ జనవరి 22న ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 28 కల్లా స్థానికులు కాని ఉద్యోగులని వారి వారి స్థానాలకు వెనక్కి పంపివేస్తారు. తెలంగాణా రక్షణల అమలుకై మిగులు నిధుల అంచనాకు ఢిల్లీనుండి ఒక బృందం వస్తుంది. ఈ హామీలతో ఉద్యమానికి ఆద్యుడైన ఖమ్మం విద్యార్థితన దీక్షను విరమించాడు. దీనితో తెలంగాణా రక్షణల అమలు ఉద్యమం ఆగిపోయింది; ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రెండవ దశలోకి ప్రవేశించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి