టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో అడివి శేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. అడివి శేష్ నటిస్తే   సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అడివి శేష్ గత సినిమా మేజర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయగా ఈరోజు డెకాయిట్ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఒక ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంది. డెకాయిట్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం.

కథ :

హరిదాస్ (అడివి శేష్) ఒక హత్య కేసులో 13 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. ఒకరోజు కడప జైలు నుంచి అతన్ని వేరే చోటికి మారుస్తుండగా, ఇషాద్ భాయ్ అనే వ్యక్తి సహాయంతో పోలీసుల నుండి చాకచక్యంగా తప్పించుకుంటాడు. విదేశాలకు (దుబాయ్) వెళ్లి సెటిల్ అవ్వాలనేది అతని ప్లాన్. కానీ అందుకు సుమారు ₹60 లక్షల రూపాయలు అవసరమవుతాయి.

దేశం విడిచి వెళ్లేముందు, తన జీవితాన్ని నాశనం చేసిన తన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్)పై పగ తీర్చుకోవాలని హరి నిర్ణయించుకుంటాడు. ఆమె వల్లే తను ఇన్నేళ్లు జైలులో గడపాల్సి వచ్చిందని అతను నమ్ముతాడు.

హరిదాస్ ఆమెను వెతుక్కుంటూ వెళ్లేసరికి, సరస్వతి ఒక ఆరేళ్ల కూతురికి తల్లిగా కనిపిస్తుంది. ఆమె భర్త భాస్కర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంటాడు. అతన్ని బ్రతికించుకోవడానికి ఆమెకు ₹1 కోటి రూపాయలు అత్యవసరం. ఆమె ఉన్న దయనీయ పరిస్థితిని చూసిన హరి, ఆమె బలహీనతను ఆసరాగా చేసుకుని దెబ్బకొట్టాలని ఒక ప్లాన్ వేస్తాడు.

డబ్బు కోసం వీరిద్దరూ కలిసి కొన్ని సాహసాలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో  అసలు హరిదాస్ జైలుకు వెళ్లడానికి సరస్వతి ఎలా కారణమైంది? వీరిద్దరి మధ్య ఉన్న పాత ప్రేమ కథ ఏంటి? సీఐ స్వామి (అనురాగ్ కశ్యప్) వీళ్లను ఎలా వెంబడించాడు? అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. చివరకు తన ప్రేయసి కోసం హరిదాస్ చేసే త్యాగంతో సినిమా ముగుస్తుంది. ఒక రకంగా ఇది పగ, ప్రేమ మరియు భావోద్వేగాల కలయికతో సాగే యాక్షన్ డ్రామా డెకాయిట్.

విశ్లేషణ :

అడివి శేష్ సినిమాలంటేనే ఒక రకమైన 'మిస్టరీ' లేదా 'థ్రిల్' ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ఈ సినిమాలో కూడా శేష్ తనదైన శైలిలో ట్విస్టులు, టర్న్‌లను జోడించారు. సినిమా ప్రారంభంలో జైలు నుండి తప్పించుకునే సీక్వెన్స్, ఆ తర్వాత వచ్చే రైలు ప్రమాద సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా 'పాలపిట్టరో..' రీమిక్స్ పాట మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది.

కథలో కొత్తదనం ఉన్నప్పటికీ, సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మదించి, పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది. ప్రేయసి కోసం హీరో చేసే త్యాగం పాత సినిమాలను గుర్తుకు తెస్తుంది.

నటీనటుల పర్ఫామెన్స్ :

హరిదాస్ పాత్రలో శేష్ పూర్తి మాస్ లుక్‌లో కనిపిస్తారు. ఈ సినిమాలో ఆయన మదనపల్లి యాసలో మాట్లాడటం ఒక ప్రత్యేక ఆకర్షణ. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా మెప్పించారు. జూలియట్ పాత్రలో మృణాల్ అద్భుతంగా నటించారు. కేవలం కళ్లతోనే భావోద్వేగాలను పండించడంలో ఆమె సక్సెస్ అయ్యారు. సీఐ స్వామిగా అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీకల్ గా  భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ని బాగా ఎలివేట్ చేసింది. ధనుష్ భాస్కర్ విజువల్స్ సినిమాకు రిచ్ లుక్‌ని ఇచ్చాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను కెమెరాలో బంధించిన తీరు బాగుంది.

'డెకాయిట్' అనేది కేవలం ఒక దొంగతనం చుట్టూ తిరిగే కథ కాదు, ఇది ప్రేమ మరియు ప్రతీకారం మధ్య నలిగే ఒక వ్యక్తి పోరాటం.

రేటింగ్ : 3.0/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: