మరో ఆరు నెలల్లో జగన్ కేబినెట్‌లో మార్పులు జరగనున్న నేపథ్యంలో సీనియర్-జూనియర్ అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఎలాగైనా కేబినెట్‌లో చోటు దక్కించుకుని మంత్రి అని పిలిపించుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. అయితే సీఎం జగన్ ఎవరిని కేబినెట్ నుంచి తప్పించి, ఎవరికి అవకాశం కల్పిస్తారు? అనేది సస్పెన్స్‌గా ఉంది.


ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిల్లో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరిత ఒక్కరే జగన్ కేబినెట్‌లో ఉన్నారు. మండలి రద్దు నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ, మంత్రి పదవికి రాజీనామా చేయడంతో జిల్లాలో ఒక్కరే కేబినెట్‌లో మిగిలారు.


అయితే గుంటూరు జిల్లాలో 17 స్థానాలు ఉంటే అందులో 15 వైసీపీనే గెలుచుకుంది. ఇక 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలున్న గుంటూరు జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండటంతో, నెక్స్ట్ కేబినెట్ విస్తరణలో ఈ జిల్లా నుంచి ఒకరు లేదా ఇద్దరుకు ఛాన్స్ దక్కొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే పక్కనే 16 సీట్లు ఉన్న కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. దీంతో గుంటూరుకు ఒకటి లేదా రెండు కేబినెట్‌ బెర్త్‌లు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇందులో సీనియర్ ఎమ్మెల్యేలు ఆళ్ళ, పిన్నెల్లిల్లో ఒకరికి కేబినెట్‌లో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. 


గత ఎన్నికల ప్రచారంలోనే మంగళగిరిలో లోకేష్‌పై ఆళ్ళని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే మొదటి విడతలో ఆళ్ళకు ఛాన్స్ దక్కలేదు. కానీ ఈ సారి ఆళ్ళకు పదవి రావొచ్చని ప్రచారం జరుగుతుంది. అటు మాచర్ల నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న పిన్నెల్లిని కేబినెట్‌లో తీసుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. మరి చూడాలి ఆళ్ళ-పిన్నెల్లిల్లో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో? 


మరింత సమాచారం తెలుసుకోండి: