తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం.. కొత్తగా మూడు తల్లిపాల కేంద్రాలను మంజూరు చేసింది. ఈ మూడింటినీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేట్లబురుజు ఆస్పత్రి, సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆస్పత్రి, రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల ద్వారా తల్లి పాలు సేకరించి.. తల్లిలేని పిల్లలకు, పాలు పడని తల్లుల పిల్లలకు, చికిత్స పొందుతున్న బాలింతల పిల్లలకు అందిస్తారు..

తొమ్మిది నెలల పాటు అమ్మ కడుపులో చల్లగా సేదతీరిన శిశువు.. బయటికి వచ్చాక ఈ లోకంలో మొదట తల్లిపాలనే రుచి చూస్తుంది. ఆ తల్లి పాలే లేకపోతే.. చిన్నారి పరిస్థితి ఏం కావాలి. అలాంటి బుజ్జాయిల గురించి ఎవరికైనా తెలిస్తే వారి హృదయాలు చలించిపోతాయి. అమ్మపాలు అందక దీనావస్థలో ఉన్న పిల్లలకు తల్లి పాలు దానం చేస్తే ఎంతో మంచిది. ఆ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టిన వారవుతారు.

తల్లి పాలు అనేవి బిడ్డలకు శ్రేయస్కరం. అమృతం లాంటి పాల్లో ఆరోగ్యం దాగి ఉంటుంది. అందుకే పిల్లలకు ముర్రుపాలు పట్టించడండీ అంటారు. అదీ బిడ్డ పుట్టిన అరగంటలోపే. కానీ కొందరు తల్లులు ఆ అదృష్టానికి నోచుకోలేరు. ఎందుకంటే అనారోగ్య కారణంగానే.. లేక పాల ఉత్పత్తి సరిగాలేకనో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కన్నబిడ్డకు ఇవ్వాలనే తపన ఉన్నా.. ఏం చేయలేని పరిస్థితుల్లో మానసిక వేదన అనుభవిస్తుంటారు. అలాంటి వారి పిల్లల కోసమే తల్లి పాల కేంద్రాలు. అంతేకాదు ప్రమాదవశాత్తు.. ప్రసవించి చనిపోయిన తల్లుల బిడ్డలకు, లేక అనాథ శిశువులకు ఈ తల్లిపాల కేంద్రాలు సంజీవనిలా ఉపయోగపడనున్నాయి.


ఆరోగ్యంగా ఉండే తల్లులు తమ చనుబాలను దానం చేస్తారు. అలా వచ్చిన పాలను సైంటిఫిక్ గా స్టోర్ చేసి అవసరమైన చిన్నారులకు ఇస్తారు. తల్లి స్వయంగా శిశువులకు పాలు ఇచ్చే స్థితిలో లేనివారు తల్లిపాల బ్యాంక్ ను ఆశ్రయించవచ్చు. ఇవి బుజ్జాయిల ఎదుగుదలకు బాగా పనికొస్తాయి. తల్లిపాలు దానం చేసేవారు పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి. ఇక పాలు దానం చేసే తల్లులలో 10గ్రాముల హిమోగ్లోబిన్ ఉంటే సరిపోతుంది. ఇక తల్లిపాల బ్యాంకుల వల్ల ఐసీయూలో చికిత్సపొందే శిశువులను మరణాల నుండి తప్పించవచ్చు.



 

 


మరింత సమాచారం తెలుసుకోండి: