అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఈ రోజు, రేపు మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు చెప్పారు. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అటు ఏపీలో రానున్న 24గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వానలు పడుతాయని వివరించారు.

భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల పంట నీటమునిగింది. కొన్ని ప్రాంతాల్లో మొలకలు, మొక్కల దశలోనే ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. వరదలు, తుఫాన్లు, కరువు లాంటి విపత్తులతో పంట దెబ్బతింటే వ్యవసాయ శాఖ నష్టంపై నివేదిక రూపొందించి కేంద్రానికి పంపాలి. పైరులో 33శాతం దెబ్బతింటే ఎకరానికి కేంద్రం 10వేల రూపాయల వరకు పెట్టుబడి రాయితీ అందజేస్తోంది. కానీ వ్యవసాయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని రైతులు వాపోతున్నారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వానలకు భద్రాచలం దగ్గర గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రాచలంలోని గోదావరి నీటిమట్టం 43అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద మరింత పెరగనుందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పర్ణశాలలో సీతమ్మ వారి విగ్రహం, నార చీరల ప్రాంతం మునిగిపోయింది. అటు శ్రీశైలానికి 2లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.

ఇక హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు  కురుస్తున్న కారణంగా అధికారులు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్ 040-231111111, డయల్ 100, మై జీహెచ్ ఎంసీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. సమస్యలపై 9704444053నెంబర్ కు ఫిర్యాదు చేస్తే తానే స్పందిస్తాననీ.. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్టు మేయర్ విజయలక్ష్మి చెప్పారు. కాబట్టి ప్రజలు అతి భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.








మరింత సమాచారం తెలుసుకోండి: