ఏపీలో అధికార వైసీపీ హవా స్పష్టంగా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంతటి వైసీపీ హవాలో కూడా జనసేన పార్టీ 180 వరకు ఎం‌పి‌టి‌సి స్థానాలు గెలవడం కాస్త ఆసక్తికరమైన విషయమే. అసలు రాష్ట్రంలో జనసేనకు అంత సీన్ లేదని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. కానీ ఊహించని విధంగా జనసేన కొంతవరకు విజయాలు అందుకోవడం ఆశ్చర్యకరమైన విషయమే. బలమైన వైసీపీ, టి‌డి‌పిల మధ్య జనసేన సత్తా చాటడం మామూలు విషయం కాదు.

ఇక దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ....చాలా గొప్పగా చెప్పుకున్నారు. తమ పార్టీ తక్కువ స్థానాల్లోని పోటీ చేసి ఈ ఫలితాలు సాధించిందంటే...రాష్ర్టంలో మొత్తం పోటీ చేసి ఉంటే ఇంకా మంచి విజయాన్ని అందుకునేది అని చెప్పారు. అలాగే రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన నడుస్తోందని, తమ అభ్యర్ధులని నామినేషన్స్ వేయనివ్వకుండా అడ్డుకున్నారని, తమ అభ్యర్ధులని బాగా ఇబ్బంది పెట్టారని చెప్పారు.

ఒకవేళ వైసీపీ అడ్డుకోకపోతే విరగదీసేవాళ్లం అన్నట్లుగా పవన్ చెప్పారు. కాకపోతే పవన్ కథ అంత ముగిశాక ఎంట్రీ ఇచ్చి హడావిడి చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే నామినేషన్స్ వేసే సమయంలో వైసీపీ ఇబ్బందులకు గురి చేస్తుందనుకుంటే అప్పుడే పోరాడాల్సిఉంది. కానీ పవన్ అప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రాలో ఎంట్రీ ఇవ్వలేదు. ఏదో తిప్పలు పడి జనసైనికులు పోటీలో నిలబడ్డారు.

అలాగే కొంతవరకు గెలిచి సత్తా చాటారు. ఫలితాలు వచ్చేశాక పవన్ బయటకొచ్చి, వైసీపీ అరాచకాలు చేసిందని చెప్పడం వల్ల ఎవరికి ప్రయోజనం. అప్పుడే పవన్ పొరాడి ఉంటే జనసేన ఇంకా ఎక్కువ స్థానాలు గెలుచుకునేది అని చెప్పొచ్చు. అప్పుడేమో పోరాడకుండా ఇప్పుడు వైసీపీపై విమర్శలు చేయడం వల్ల జనసేనకు ఏ మాత్రం ఉపయోగం లేదనే చెప్పొచ్చు. కానీ ఇక నుంచి పవన్ యాక్టివ్‌గా ఉంటూ రాజకీయం చేస్తే, జనసేన కొంతమేర సత్తా చాటగలదు. అలా కాకుండా ఎప్పటిలాగానే పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేయడం వల్ల యూజ్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: