ఇటీవల ఏపీలో రోడ్ల అధ్వాన్ని స్థితిపై జనసేన ఆందోళనలు చేపట్టింది. అధ్వాన్ని స్థితిలో ఉన్న రోడ్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు జనసేన నేతలు. అదే సమయంలో ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని విస్మరిస్తే తామే ఆ పనిచేస్తామని చెప్పారు. అన్నట్టుగానే.. అక్టోబర్ 2న మరమ్మతులు మొదలు పెడతామంటూ కార్యాచరణ ప్రకటించారు కూడా.

స్వయంగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగబోతున్నారు. అనంతపురం జిల్లా కొత్త చెరువు రహదారి మరమ్మతు పనులకు పవన్ కల్యాణ్ వస్తారని ప్రకటించారు. తానే స్వయంగా వచ్చి అక్కడి రోడ్డు రిపేర్ చేస్తామని, జనసైనికులు శ్రమదానం చేస్తారని చెప్పారు పవన్ కల్యాణ్. పవన్ ప్రకటన విడుదల చేసిన తర్వాత స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు అలర్ట్ అయ్యారు. జనసేన శ్రమదానం చేస్తే ఆ క్రెడిట్ వారికి దక్కుతుందేమోనన్న ఆలోచనతో హడావిడిగా పనులు మొదలు పెట్టారు.

ధర్మవరం - పుట్టపర్తి రోడ్డులో మరమ్మతులు మొదలయ్యాయి. ఆర్ అండ్ బి అధికారులు పనులు మొదలు పెట్టారు. రోడ్డు దెబ్బతిన్నచోట గుంతలను చదును చేశారు. కంకర వేసి రోలర్ తో గుంతలను పూడ్చేశారు. మామిళ్లకుంట అనే ప్రాంతం నుంచి కొత్త చెరువు మార్కెట్ యార్డ్ వరకు ఏడున్నర కిలోమీటర్ల మేర రోడ్డు పనులు పూర్తి చేస్తున్నారు.

అయితే వైసీపీ నేతలు మాత్రం తమదైన శైలిలో వివరణ ఇచ్చుకుంటున్నారు. ఇటీవలే రోడ్డు పనులకు నిధులు విడుదలయ్యాయని, రెండున్నర కోట్ల రూపాయలతో రోడ్డు మరమ్మతులు మొదలు పెట్టామని చెబుతున్నారు. రాష్ట్రంలో అన్ని చోట్లా రోడ్లు గుంతలమయం అయితే.. కొత్తచెరువులోనే హడావిడిగా పనులు ఎందుకు మొదలు పెట్టారనేది మాత్రం వారికే తెలియాలి. పవన్ కల్యాణ్ పర్యటన ఉండటంతో వెంటనే ఆ రోడ్డు మరమ్మతులు మొదలయ్యాయి. రేపు జనసైనికులు దీన్ని తమ విజయంగా చెప్పుకునే అవకాశం ఉన్నా కూడా.. వారి శ్రమదానంతో రోడ్డు బాగు చేయడం మరింత డ్యామేజింగ్ గా ఉంటుంది కాబట్టి.. వైసీపీ నేతలే ముందుకొచ్చి రోడ్డు పనులు పూర్తి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: