ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిపోయి.. జగన్ సీఎం అయిన తర్వాత.. కియా పరిశ్రమ కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి. కియా కార్ల పరిశ్రమ పెద్దలను వైసీపీ నేతలు బెదిరించారని.. ముడుపులు అడిగారని ప్రచారం జరిగింది. కియా కార్ల పరిశ్రమకు చెందిన ఓ వేడుకలో వైసీపీ ఎంపీ ఒకరు కియా ప్రతినిధులను బెదిరించారని కూడా కొన్ని ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మొత్తానికి జగన్ సర్కారు అంతగా పరిశ్రమలను ప్రోత్సహించదన్న ఫీలింగ్ వచ్చేలా ఈ ప్రచారాలు సాగాయి.
అయితే.. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇవన్నీ దుష్ప్రచారాలేనా అన్న అభిప్రాయం కలుగుజేస్తోంది. అదేంటంటే.. తాజాగా కియా ఇండియా ఎండీ, సీఈవో టే జిన్‌పార్క్ సీఎం జగన్‌ను కలిశారు. ప్రత్యేకించి కరోనా వేళ సాయం చేశారంటూ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారట కియా ఇండియా ఎండీ. ప్రభుత్వం ప్రత్యేకంగా సాయం వల్లే సామర్థ్యానికి మించి కార్ల ఉత్పత్తి చేశామని.. అలాగే మార్కెటింగ్ జరిగిందని కియా ఇండియా ఎండీ, సీఈఓ టే జిన్‌పార్క్ చెబుతున్నారు.
అంతే కాదు.. ఏపీలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులపై కియా బృందంతో సీఎం జగన్ చర్చలు జరిపారట. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఇస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహకాలపై కియా బృందంతో సీఎం చర్చించారట. మొత్తానికి కియా ప్రతినిధులు వచ్చి జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలపడం ఆసక్తికరమైన విషయమే. ఈ ఘటనతో జగన్‌పై గతంలో ఉన్న కియా వ్యతిరేక ముద్ర తొలగిపోతుందా..? చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి