ఏపీలో బీజేపీకి భవిష్యత్ ఉందా? అంటే అసలు ఏ మాత్రం లేదనే చెప్పేయొచ్చు. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏపీలో కాస్త ఉనికి ఉంది గానీ...మామూలుగా అయితే ఆ పార్టీకి పెద్ద సీన్ లేదనే చెప్పాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రానికి ఇచ్చిన హామీలని నెరవేరిస్తే ప్రజలు కాస్త కనికరిస్తారు గానీ..లేకపోతే నోటాతో పోటీ పడాల్సిందే. ఒకవేళ టీడీపీ, వైసీపీలతో గానీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి కాస్త కొన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక జనసేనతో పొత్తు పెట్టుకున్న సరే పెద్దగా ప్రయోజనం లేదని ఇప్పుడు తెలుస్తూనే ఉంది.

కాకపోతే వైసీపీతో పొత్తు అసాధ్యం...టీడీపీతో పొత్తు లేదంటుంది...కాబట్టి బీజేపీకి ఏపీలో సీన్ లేదు. మరి ఆ పార్టీలో ఉన్న నాయకుల పరిస్తితి ఏంటి? అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటే కనీసం ఏదొక దారి ఉంటుంది..లేకపోతే కొందరు నాయకుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా ఉందనే చెప్పొచ్చు. ముఖ్యంగా సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వారిది.

బైరెడ్డి ఎంత సీనియర్ నాయకుడో అందరికీ తెలుసు. ఆయన గతంలో టీడీపీలో అనేక ఏళ్ళు పనిచేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక 2009లో టీడీపీ తరుపున పాణ్యంలో పోటీ చేసి ఓడిపోయి...ఆ తర్వాత నుంచి పార్టీ నుంచి బయటకొచ్చి రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో రాజకీయాలు చేసి...చివరికి అది వదిలేశారు. అయితే గత ఎన్నికల ముందు ఆయన టీడీపీ వైపు రావడానికి చూశారు. అలాగే ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో బైరెడ్డి..బీజేపీలో చేరిపోయారు. తన తనయురాలు శబరితో కలిసి బీజేపీలో చేరి రాజకీయం చేస్తున్నారు.

ఇక బీజేపీలో ఉండటం వల్ల బైరెడ్డికి పెద్ద ఉపయోగం లేదనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన గెలవడం కష్టం.  మరి అలాంటప్పుడు బైరెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే చూడాలి. వచ్చే ఎన్నికల్లో ఆయన ఫ్యూచర్ ఏంటో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: