నిన్న‌టి వేళ  అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో అల్లు అర్జున్ చెప్పిన మాట‌లు చాలా ఆలోచ‌నాత్మ‌కంగా ఉన్నాయి. ఒక‌ప్పటి క‌న్నా ఇప్పుడు ఆయ‌న మాట‌లో న‌డ‌వ‌డిలో మంచి ప‌రిణితి వ‌చ్చింది. ఓ పెద్ద హీరో సినిమాకు ఒక‌ప్పుడు థియేట‌ర్ ను కానీ బిజినెస్ విష‌య‌మై కానీ ఇంకా చెప్పాలి అంటే బ‌డ్జెట్ విష‌య‌మై కానీ ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. అవును ఆయ‌న చెప్పిన విధంగా ఆలోచించినా ఇదే స‌బ‌బు కూడా! ఎందుకంటే స్టార్ డ‌మ్ అన్న‌ది ఓ సినిమాకు ఓ పెద్ద గౌర‌వం అదేవిధంగా బిజినెస్ స‌ర్కిల్స్ లో అదే అద‌న‌పు విలువ. కానీ కాల గ‌తిలో స్టార్ డ‌మ్ అన్న ప‌దం లేకుండా పోయింది. పోయింది కాదు పోనుంది. దీంతో చిన్న సినిమాల‌కే పెద్ద హ‌వా వ‌స్తోంది. అందుకు త‌గ్గ మార్కెట్ ప్ర‌మోష‌న్ అన్నింటినీ పెద్ద హీరోలే చేప‌డుతూ ఇండ‌స్ట్రీని కాపాడుతున్నారు అన్న‌ది నిజం. ఇందులో ఇగోల గోల లేక‌పోవ‌డం బాగుంది. చిరు, ప్ర‌భాస్, బ‌న్నీ ఇలా ఒక్క‌రేంటి అంతా క‌లిసి చిన్న సినిమాను బ‌తికించుకుని త‌ద్వారా పెద్ద సినిమా మనుగ‌డ‌ను నిల‌బెట్టాల‌ని భావిస్తూ ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. ఏపీ స‌ర్కారు కూడా త్వ‌ర‌లో మినీ థియేట‌ర్ల నిర్మాణానికి సై అంటోంది. కొన్ని రాయితీలు ఇచ్చి నిర్మాణం చేప‌ట్టాల‌ని భావిస్తోంది. అదే జ‌రిగితే 50 సిట్టింగ్ తో ఉన్న థియేట‌ర్లు కూడా రానున్నాయి. అలా వ‌స్తే సినిమాలు బ‌తుకుతాయి..థియేట‌ర్లు బతుకుతాయి. షాపింగ్ మాల్ కం థియేట‌ర్లు ఎక్కువ‌యి న‌గ‌ర శోభ‌ను పెంచుతాయి. ఆ విధంగా ప్రేక్ష‌కుడికి థియేట‌ర్ తో క‌నెక్టివిటీ పెరుగుతుంది. ఫ‌లితంగా వారం రోజులు సినిమాలు పోయి క‌నీసం ఓ సినిమా బ‌తుకు 30 రోజుల‌యినా ఉండేందుకే అవ‌కాశాలు ఉన్నాయి.

చిన్న సినిమాలు అంటే ఒక‌ప్పుడు చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు చిన్న సినిమాలు అంటే ఇండ‌స్ట్రీకో గౌర‌వం ఏర్ప‌డింది. ఒక‌ప్పుడు చిన్న సినిమాల ఫంక్ష‌న్ల‌కు పెద్ద హీరోలు వ‌చ్చేవారు కాదు. అస‌లు ఆ సినిమాల ప్ర‌మోష‌న్ నే పట్టించుకునేవారు కాదు. కాల క్ర‌మంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాల‌ను త‌ల‌ద‌న్నేలా మంచి విషయంతో రూపొంది మంచి విజ‌యాలు న‌మోదు చేస్తున్నాయి. దీంతో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ‌లు అన్నీ చిన్న చిత్రాల నిర్మాణం వైపే మొగ్గు చూపుతున్నాయి. అంతేకాదు పెద్ద పెద్ద హీరోలు కూడా ఇప్పుడిప్పుడే త‌మ ఆలోచ‌న ధోర‌ణి మార్చుకుని చిన్న చిత్రాలపై ప్రేమ పెంచుకుంటున్నారు. చిన్న చిత్రాల స‌ర‌ళి బాగుండాల‌ని కోరుకుంటున్నారు. అంతేకాదు త‌మ నిర్మాణ సంస్థ‌ల నుంచి కూడా చిన్న చిత్రాలను రూపొందించి అప్ క‌మింగ్ టాలెంట్ ను బాగానే ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఈ కోవ‌లో ఈ తోవ‌లో అల్లు అర‌వింద్ మొదలుకుని చాలా మంది బ‌డా నిర్మాత‌లు ఇటుగానే అడుగులు వేస్తున్నారు. ఎప్ప‌టి నుంచో ఒక పెద్ద సినిమా రెండు చిన్న సినిమాల‌తో స‌మానం అన్న నియ‌మం ఉంది క‌నుక ఇదే ఫార్ములాతో సురేశ్ బాబు ప‌నిచేస్తున్నారు. కానీ ఆయ‌న థియేట‌ర్ రిలీజ్ వైపు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. ఓటీటీ రిలీజ్ అన్న‌ది సేఫ్ అని భావిస్తున్నారు. అల్లు అర‌వింద్ కూడా థియేట‌ర్ రిలీజ్ క‌న్నా ఓటీటీ కంటెంట్ ను డెవ‌ల‌ప్ చేసి ఇక్కడే స్థిర‌ప‌డిపోదాం అన్న ఆలోచ‌నే చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఓటీటీలు బాగానే ఉన్నా రేప‌టి వేళ మ‌ళ్లీ థియేట‌ర్ కు పూర్వ వైభ‌వం రావ‌డం ఖాయం అని అంటున్నాయి సినీ వ‌ర్గాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: