ఏపీసీసీ అధ్యక్షుడి మార్పు అనివార్యమని తేలిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ అద్యక్షుడిగా ఉన్న డాక్టర్ సాకే శైలజానాద్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినట్లు పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చేసింది. అందుకనే సాకేను మార్చేసి కొత్త నేతకు అద్యక్ష బాద్యతలు అప్పగించేస్తే పార్టీని రేసుగుర్రం లాగ పరిగెత్తిస్తారని అధిష్టానం భావిస్తున్నది. ఇక్కడ సమస్య ఏమిటంటే పార్టీకి అద్యక్షుడిని మార్చితేనో లేకపోతే పదిమందికి అద్యక్ష బాధ్యతలు అప్పగిస్తేనో పార్టీ లేచి పరిగెత్తే పరిస్ధితి లేదు.




ఎందుకంటే 2014లో జరిగిన రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారిపోయింది. మెజారిటి జనాల మనోభావాలను అర్ధం చేసుకోకుండా అడ్డుగోలు విభజన చేసిన పాపం ఊరికేపోతుందా ? ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనే జనాలు పార్టీని వందడుగుల గొయ్యితీసి పాతేశారు. ఆ గోతిలో నుండి పాపం పార్టీ ఇప్పటికీ ఈజిప్టు మమ్మీ లాగ చప్పుడు చేయకుండా పడుకునేసుంది. దీన్ని తట్టిలేపాలంటే ఇప్పుడిప్పుడే ఎవరికీ  సాధ్యంకాదు.




అంతకుముందు వరుసగా రెండు ఎన్నికల్లో పార్టీని గెలిపించిన జనాలకు కాంగ్రెస్ అధిష్టానం మంచి బహుమానమే ఇచ్చింది. ఆ బహుమానాన్ని జనాలు మరచిపోలేకున్నారు. అందుకనే 2019 ఎన్నికల్లో కూడా ఎవరికీ కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వలేదు. ఇలాంటి పార్టీకి తొందరలోనే కొత్త అద్యక్షుడి నియామకం జరగబోతోందట. రేసులో మాజీ ఎంపీలు చింతామోహన్, హర్షకుమార్, సీనియర్ నేత గిడుగు రుద్రరాజు పేర్లు వినబడుతున్నాయి.




వీరిలో ఎవరి స్ధాయి ఏమిటి అనేది ఇక్కడ అనవసరం. ఎందుకంటే వీళ్ళముగ్గురు కూడా పార్టీ మీద ఆధారపడి ఎదిగిన వాళ్ళే. తమ సొంతకాళ్ళపైన నిలబడి పోటీచేసి పట్టుమని వంద ఓట్లు తెచ్చుకునేంత సీన్  కూడా వీళ్ళల్లో ఎవరికీ లేదు. వీళ్ళనే కాదు ఇపుడున్న నేతల్లో చాలామంది పరిస్దితి ఇలాగే ఉంటుంది. ఇపుడు వినబడుతున్న పేర్లలో చింతా, హర్షకుమార్ ఇద్దరు ఎస్సీలు. రుద్రరాజు క్షత్రియుడు. మరిలోనే కొత్త అధ్యక్షుడుంటారా ? లేకపోతే అకాస్మత్తుగా కొత్త వాళ్ళొస్తారా ? అనేది చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: