శిద్దా రాఘవరావు... ప్రకాశం జిల్లాలో ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. ఆ మాటకు వస్తే... ప్రముఖ పారిశ్రామిక వేత్తగా గుర్తింపు తెచ్చుకున్న నేత కూడా. తెలుగుదేశం పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించారు శిద్దా రాఘవరావు. ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందిన శిద్దా రాఘవరావు అటు కులంలో కూడా పెద్దగానే వ్యవహరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందిన శిద్దా రాఘవరావు కుటుంబానికి చీమకుర్తి పరిసరాల్లోని బూదవాడ గ్రామంలో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. అలాగే గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహించిన శిద్దా రాఘవరావు ఒకదశలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాస పాత్రుడిగా కూడా వ్యవహరించారు. గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు వెంటే ఉన్నారు. దీంతో శ్రీశైల దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా, శాసనమండలి సభ్యునిగా కూడా వ్యవహరించారు శిద్దా రాఘవరావు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మంత్రిగా వ్యవహరించారు శిద్దా రాఘవరావు. రవాణా శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా వ్యవహరించిన శిద్దా రాఘవరావు... దర్శి నియోజకవర్గంలో దాదాపు 2 వేల కోట్ల రూపాయలకు పైగా పనులు చేశారు. ఇక 2019 ఎన్నికల్లో శిద్దా గెలుపు ఖాయమని కూడా అంతా భావించారు. కానీ అనూహ్యంగా శిద్దా రాఘవరావును అసెంబ్లీకి బదులుగా ఒంగోలు పార్లమెంట్ నుంచి బరిలో నిలిపారు చంద్రబాబు. దీంతో దర్శి టికెట్ శిద్దా కుమారుడు సుధీర్ బాబుకు ఇవ్వాలని కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కానీ మాజీ ఎమ్మెల్యే కదరి బాబూరావును కనిగిరికి బదులుగా దర్శి నుంచి పోటీలో నిలిపారు చంద్రబాబు. దీంతో అటు ఒంగోలు పార్లమెంట్ స్థానంతో పాటు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలో చేరిపోయింది. చివరికి కదిరి బాబూరావు, శిద్దా రాఘవరావు కూడా వైసీపీలో చేరిపోయారు. దీంతో దర్శి నియోజకవర్గంలో టీడీపీకి సరైన నేత లేకుండా పోయారు. మరోవైపు శిద్ధా రాఘవరావు మళ్లీ టీడీపీలోకి వస్తారనే చర్చ కూడా ప్రస్తుతం జోరుగా సాగుతోంది. దర్శి నియోజకవర్గ టికెట్ చంద్రబాబు మళ్లీ శిద్ధాకే కేటాయిస్తారని కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: