ఆయన రాక కాంగ్రెస్ లో కాక రేపుతోందా..ఇప్పుడాయన అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయా?ఈ విషయంలో పిసీసీ చీఫ్ వైఖరేంటి? రీ ఎంట్రీ ఇస్తున్న నేత సొంత జిల్లాలో రియాక్షన్ ఎలా ఉంది? తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు డి. శ్రీనివాస్ రాకతో పెద్ద పంచాయితే జరుగుతోంది. డీఎస్ రీఎంట్రీ వెనుక ఎవరున్నారు, అధిష్టానంతో నేరుగా  సంబంధాలు ఉంటే రాష్ట్ర నాయకత్వం అనుమతిలేకుండా చేరడం సాధ్యమేనా? గతంలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన డి.ఎస్ క్లిష్ట సమయంలో పార్టీని నట్టేట ముంచి పోయారని ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తుంటాయి. అలాంటి వ్యక్తిని తిరిగి కాంగ్రెస్ లో చేర్చుకోవడం ఏంటని నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట.

 అయితే పార్టీ చీఫ్ సోనియా గాంధీ తో డిఎస్ భేటీ జరిగిన మొదట్లోనే రాష్ట్ర కాంగ్రెస్ లోని ముఖ్య నాయకులు  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచారు. శ్రీనివాసును ఇప్పుడు చేర్చుకోవడం వల్ల వచ్చే లాభం లేదు. ఈ విషయాన్ని హైకమాండ్ కు మరోసారి చెప్పాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సూచించారట. కానీ ఆ ప్రయత్నాలేవి వర్కౌట్ అయినట్లు లేవు. డీఎస్  చేరిక ఆగడం లేదు. ఆయన త్వరలో కాంగ్రెస్ కండువా కప్పేసుకోబోతున్నారు.డిఎస్ చేరిక గురించి తనకు తెలియదని,హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలు తప్పితే ఆ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని తన సన్నిహితుల దగ్గర,పార్టీ నాయకుల వద్ద రేవంత్ రెడ్డి ప్రస్తావించారట. ఈ వివరణను నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లీడర్ విశ్వసించడం లేదట. రేవంత్ సానుకూలంగానే ఉన్నారని అనుకుంటున్నారట. పీసీసీ చీఫ్ గా రేవంత్ పగ్గాలు చేపట్టాక డి.ఎస్ కుమారుడు సంజయ్ వచ్చి కలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సంజయ్ కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారని ప్రచారం జరిగినా,మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తదితరులు  అభ్యంతరం వ్యక్తం చేయడంతో చేరిక వాయిదా పడింది. చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీ వేయాలనే ప్రతిపాదన పిసిసి ముందుకు వచ్చింది. ఆ కమిటీ కూర్పు పూర్తికాకముందే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీతో డీఎస్ భేటీ కావడం, కాంగ్రెస్ లో రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఖంగుతిన్నారట. డి.ఎస్ కుమారుడు సంజయ్ చేరికపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇప్పుడు ఏకంగా బి శ్రీనివాసును చేర్చుకోవడం ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారట.

 ఆయన కుమారుల్లో ఒకరు బీజేపీ ఎంపీగా ఉంటూ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు. అలా చేయకుండా డిఎస్ కట్టడి చేయగలరా?  వచ్చే ఎన్నికల్లో కుమారుడికి ఓటు వేయద్దు, కాంగ్రెస్ కే వేయాలని ప్రచారం చేయగలరా అని నిలదీస్తున్నారట జిల్లా కార్యకర్తలు. తండ్రి కాంగ్రెస్ లో,ఒక కుమారుడు బిజెపిలో ఉంటే ఎలాంటి సంకేతాలు జనాల్లోకి వెళతాయని  ప్రశ్నిస్తున్నారట. డిఎస్ వల్ల ఆయన సామాజిక వర్గమైన  కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుంద అనేది వారి మౌలిక ప్రశ్న. పైగా కాంగ్రెస్ లో డిఎస్ ను చేర్చుకోవడం వల్ల పార్టీ కంటే శ్రీనివాస్ కే లాభమనేది గాంధీభవన్ లో చెవులు కొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: