ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసింది టీటీడీ. శుక్రవారానికి సంబంధించి 28 టికెట్లు, మిగిలిన 503 టికెట్లు తర్వాతి రోజులవి. శుక్రవారానికి సంబంధించి ఒక్కో టికెట్ రేటు కోటిన్నర రూపాయలు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆన్ లైన్ లో టికెట్లను ఉంచితే కోటిన్నర రూపాయల టికెట్లన్నీ ఒకేరోజు అమ్ముడయ్యాయి. కోటి రూపాయల టికెట్లలో రాత్రి 8గంటల వరకు 48 టికెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. శుక్రవారం టికెట్ రేటు ఎక్కువగా ఉన్నా కూడా భక్తులు వాటికోసం ఆసక్తిగా ఎదురు చూశారు, సొంతం చేసుకున్నారు.
తిరుపతిలోని చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికోసం విరాళంగా ఈ టికెట్ల ద్వారా వచ్చిన సొమ్ముని వినియోగిస్తామని టీటీడీ చెబుతోంది. వ్యక్తిగతంగా విరాళం ఇచ్చిన భక్తులకు 25ఏళ్లపాటు సంవత్సరంలో ఒకరోజు దాతతో కలిపి ఆరుగురికి ఉదయాస్తమాన సేవలకు అవకాశం కల్పిస్తారు. ఏదైనా కంపెనీ తరపున ఉదయాస్తమాన సేవలకు టికెట్ తీసుకుంటే 20ఏళ్లపాటు ఆ సేవలో వారు పాల్గొనే అవకాశం ఉంటుంది.
కరోనావల్ల శ్రీవారి దర్శన భాగ్యం చాలామందికి లభించలేదు. అంతా ఆన్ లైన్లోనే అనడంతో చాలామంది వెనక్కి తగ్గారు. తాజాగా సర్వదర్శనానికి సంబంధించిన టోకెన్లను తిరుపతిలో ఇస్తుండటంతో అవన్నీ వెంటనే బుక్ అయిపోతున్నాయి. త్వరలో కాలినడకన వచ్చేవారికి కూడా ఉచిత దర్శన టోకెన్లను ఇచ్చే ప్రక్రియను టీటీడీ ప్రారంభిస్తోంది. ఉచిత దర్శనం నుంచి కోటిన్నర రూపాయల దర్శనం వరకు.. తిరుమలలో ఏ దర్శనానికి అయినా ఎక్కడలేని డిమాండ్ ఉంటుంది. స్వామివారి దర్శనభాగ్యం కోసం భక్తులు అంతలా ఎదురు చూస్తుంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి