ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల నియామకం, తదనంతర పరిణామాలు అందరికీ తెలిసిందే. ముందుగా సచివాలయ ఉద్యోగులుగా వారిని పరిగణించి, మహిళా శిశు సంరక్షణ కార్యదర్శులుగా ఉద్యోగాల్లోకి తీసుకున్నా తర్వాత పోలీస్ విభాగంలో కలిపేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. మహిళా పోలీస్ అంటూ డిసిగ్నేషన్ మార్చేసి డిపార్ట్ మెంట్ కి అటాచ్ చేయాలని భావించింది. వారికి కూడా పోలీస్ యూనిఫామ్ ఉండాలని సూచించింది. గతంలో ఓసారి మహిళా పోలీసుల్ని డిపార్ట్ మెంట్ లో కలిపేసే విషయంలో అభ్యంతరాలు రావడంతో ఏకంగా ప్రభుత్వం రెండు జీవోలు తెచ్చింది. ఆ జీవోల ప్రకారం ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో విధుల్లో ఉన్న మహిళా పోలీసులను, ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో కలిపేస్తారు, ఇకపై జరిగే రిక్రూట్ మెంట్లకు మాత్రం కొత్తగా విధి విధానాలు ఖరారు చేశారు.

అయితే ఈ రెండు జీవోలపై కూడా ఇప్పుడు కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈసారి కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం తరపున కౌంటర్ వినేందుకు కేసుని ఈరోజుకి వాయిదా వేసింది. దీంతో మహిళా పోలీసులు మరోసారి టెన్షన్ కి గురవుతున్నారు. అసలు తాము సచివాలయ ఉద్యోగులమా, లేక పోలీస్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులమా అనేది తేల్చుకోలేకపోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2500మంది మహిళా పోలీసులు గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం సచివాలయాలకు హాజరై.. గ్రామంలో సమస్యలు ఉంటే వాటిని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఎస్సైలకు సమాచారం చేరవేస్తున్నారు. గ్రామ స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలుంటే ఫోన్ ద్వారా వారికి ఆదేశాలిస్తుంటారు పోలీస్ అధికారులు. అంతకు మించి పెద్ద గొడవలు అయితే నేరుగా తామే రంగంలోకి దిగుతుంటారు. అయితే ప్రతి గ్రామంలో ఓ మహిళా పోలీసు ఉండటం వల్ల స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు సమాచారం పోలీసులకు వెళ్లిపోతోంది. దీంతో కొంతవరకు గ్రామాల్లో అనవసరపు వివాదాలు మొదలు కావడంలేదు. బాల్య వివాహాలు, బాల కార్మికులు.. వంటి సమస్యలకు కూడా మహిళా పోలీసుల వల్ల చక్కటి పరిష్కారం లభిస్తోంది. అయితే ఇప్పుడు వీరిని డిపార్ట్ మెంట్ లో విలీనం చేస్తే.. తర్వాతి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికయితే కోర్టు మరోసారి అడ్డుకట్ట వేసింది.. తుది తీర్పుతో మరింత స్పష్టత వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: