రాష్ట్రంలో కొన్ని లోక్ సభ సీట్లు ప్రధాన ప్రతిపక్షం టీడీపీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటి సీట్లలో ఒంగోలు పార్లమెంటు సీటు కూడా ఒకటి. 1983లో మొదటిసారి టీడీపీ పోటీ చేసినప్పటినుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో గెలిచింది కేవలం రెండంటే రెండుసార్లే అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. టీడీపీ తరపున పోటీచేసిన వాళ్ళల్లో అత్యధికులు ప్రముఖులనే చెప్పాలి. అయినా లోక్ సభ స్ధానంలో గెలుపు కష్టంగాన ఉంటోంది.





1984లో మొదటిసారి బెజవాడ పాపిరెడ్డి గెలిచారు. తర్వాత 1999లో కరణం బలరామ కృష్ణమూర్తి గెలిచారు. నిజానికి ఇద్దరూ అతితక్కువ మెజారిటితోనే గెలిచినా గెలుపు గెలుపే కాబట్టి ఓకే. మొత్తం పదిసార్లు ఈ నియోజకవర్గంలో  టీడీపీ పోటీచేస్తే గెలిచింది కేవలం రెండుసార్లు మాత్రమే అంటే చాలా పూర్ షో అనే చెప్పాలి. ఎందుకిక్కడ టీడీపీ వరసగా ఓడిపోతోంది ? ఎందుకంటే ప్రతి ఎన్నికకు పార్టీ కొత్త అభ్యర్ధిని దింపుతోంది.





1996, 98 ఎన్నికల్లో మాత్రమే మేకపాటి రాజమోహన్ రెడ్డి రెండుసార్లు పోటీచేశారు. నిజానికి టీడీపీ తరపున మేకపాటి రెండుసార్లు వరసగా పోటీచేయటమే పెద్ద రికార్డు. ఎప్పుడు ఓడిపోయినా వెంటనే పార్టీ అభ్యర్ధిని మార్చేస్తోంది. దాంతో కొత్తవాళ్ళు నిలదొక్కుకోవటానికి నానా అవస్తలు పడుతున్నారు. ముందు పార్టీనేతల్లో యాక్సెప్టెన్స్ వస్తేనే కదా తర్వాత జనాల ముందుకు వెళ్ళేది. ప్రతి ఎన్నికకు కొత్త మొహాన్ని నేతలకు పరిచయం చేస్తుంటే ఇక జనాలేమి గుర్తుపెట్టుకుంటారు ?





ఇటీవలి చరిత్రనే తీసుకుంటే 2014లో మాగుంట శ్రీనివాసులరెడ్డి  పోటీచేసి ఓడిపోయారు. తర్వాత ఎంఎల్సీగా అవకాశం తీసుకున్నారు. ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామాచేసి వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి గెలిచారు. 2019లో టీడీపీ తరపున పోటీచేసిన శిద్ధా రాఘవరావు తర్వాత వైసీపీలో చేరిపోయారు. అంటే ఇపుడు టీడీపీ తరపున పోటీ చేయటానికి అభ్యర్ధిలేరు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మళ్ళీ కొత్త మొహాన్ని చూసుకోవాల్సిందే.  చూస్తుంటే ఈ సీటు టీడీపీని బాగా ఇబ్బంది పెడుతున్నట్లు అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: