తెలంగాణాలో ముందస్తు ఎన్నికల గోల పెరిగిపోతోంది. ఒకవైపు కేసీయార్ ఏమో ముందస్తు ముచ్చట లేదని ఎంత చెప్పినా ప్రతిపక్షాలు వినిపించుకోవటంలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలైతే ముందస్తు విషయంపై నానా యాగీ చేస్తున్నాయి.  కిషన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి కొందరు నేతలైతే అసెంబ్లీ రద్దుకు, ముందస్తు ఎన్నికలకు ముహూర్తం కూడా పెట్టేశారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కేసీయార్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. అలాగే ఇపుడు కూడా వెళతారు అనేది ప్రతిపక్ష నేతల గోల.





అసలు ముందస్తుకు వెళ్ళాలా వద్దా అన్నది కేసీయార్ ఇష్టం. పైగా కేసీయార్ ముందస్తుకు సిఫారసుచేసినా కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నికలు నిర్వహించాలని ఏమీలేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామనంటే కేసీయార్ చేయగలిగేది కూడా ఏమీలేదు. ఈ విషయంలో బాగా నాలెడ్జున్న కేసీయార్ ప్రస్తుత పరిస్ధితుల్లో ముందస్తుకు ఎందుకు వెళతారు ? గతంలో చంద్రబాబునాయుడు తన ప్రభుత్వాన్ని రద్దుచేసుకుని ముందస్తుకు సిఫారసు చేస్తే ఎన్నికల కమీషన్ నిర్వహించలేదు.





ఇపుడు విషయం ఏమిటంటే కేంద్రమంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు రావటం ఖాయమన్నారు. అంతా బాగానే ఉందికానీ నిజంగానే ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్లు ముందస్తు ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం ? కేసీయార్ కు జరిగే లాభం సంగతిని పక్కనపెట్టేస్తే ప్రతిపక్షాల్లో  బీజేపీ, కాంగ్రెస్ ముణగటం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ నేతలు మాట్లడే మాటలన్నీ డొల్లే అని అందరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్ లో అంతర్గత వివాదాలతో ఇబ్బంది పడుతోంది.





119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి బీజేపీకి గట్టి అభ్యర్ధులు ఎంతమందున్నారు ? అందుబాటులోని సమాచారం ప్రకారం పట్టుమని 30 నియోజకవర్గాల్లో కూడా గట్టి అభ్యర్ధులు లేరు. అందుకనే పక్కపార్టీల్లోని నేతలకు గాలమేస్తోంది. కేసీయార్ గనుక హఠాత్తుగా ముందస్తు అని నిజంగానే అంటే ముందుగా ముణిగేది బీజేపీనే. ఇక కాంగ్రెస్  వివాదాల గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువే అవుతుంది. ఇవన్నీ బాగా తెలిసినందు వల్లే కేసీయార్ హ్యాపీగా తనపని తాను చేసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: