తొందరలోనే కాపు సంక్షేమసేన ప్రముఖులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కాబోతున్నారు. ఈనెల 14వ తేదీన మచిలీపట్నంలో జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాపుసంక్షేమసేన ప్రముఖులతో భేటీ అవ్వాలని పవన్ అనుకున్నారు. దీనికి కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ల అంశం చాలా కీలకపాత్ర పోషించే అవకాశం ఉండటమే. ఇప్పటివరకు కాపులకు రిజర్వేషన్ కావాలని కానీ లేదా 5 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని కానీ పవన్ డిమాండ్ డైరెక్టుగా  చేయలేదు.





కాపులకు రిజర్వేషన్ అంశమైతే రగులుతునే ఉంది. ఎలాగూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగసభ జరగబోతోంది. కాబట్టి ఆరోజుకు రిజర్వేషన్లపై పార్టీ స్టాండ్ ఏమిటనేది డిసైడ్ చేసి వేదిక మీదే ప్రకటించాలని పవన్ అనుకున్నారట. అందుకనే ముందుగా కాపుసంక్షేసేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య తదితరులతో భేటీ కావాలనుకున్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలుచేయాలనే సంక్షేమసేన డిమాండుకు పవన్ మద్దతుపలికిన విషయం తెలిసిందే.





కాబట్టే అదే డిమాండ్ విషయంలో పార్టీ లైన్ గా  పవన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇందుకోసమని 11వ తేదీన సమావేశం జరగబోతోంది. అలాగే పొత్తుల విషయంపై చర్చించేందుకు 12వ తేదీన పార్టీలోని ముఖ్యులతో సమావేశం నిర్వహించబోతున్నారు. అంటే 11, 12 తేదీల్లో పవన్ ఆధ్వర్యంలోనే కీలకమైన చర్చలుంటాయని అర్ధమవుతోంది. పై  తేదీల్లోని చర్చల సారంశంపై  13వ తేదీన రాజకీయ వ్యవహారాల కమిటి ముఖ్యులతో సమావేశమై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ విషయంలో పార్టీ నేతల నుండి కూడా ఒత్తిడి పెరిగిపోతోందట. 






వీటన్నింటినీ కలిపి 14వ తేదీ బహిరంగసభలో ప్రకటిస్తారని పార్టీవర్గాలు చెప్పాయి. పై సమావేశాల్లోనే నియోజకవర్గాల వారీ సమీక్షలు, వారాహి యాత్రలు తదితరాలు కూడా డిసైడ్ అయ్యే అవకాశముందని నేతలంటున్నారు. మొత్తంమీద ఆవిర్భావ సదస్సును భారీ ఎత్తున నిర్వహించబోతున్నారన్నది వాస్తవం. అందుకనే కాపులు ఎక్కువగా ఉండే మచిలీపట్నాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. 14వ తేదీ బహిరంగసభలో పవన్ ఏమి ప్రకటన చేస్తారనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: