ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అనూహ్య విజయం సాధించింది. ఏడుస్ధానాలకు జరిగిన ఎన్నికల్లో సంఖ్యారీత్యా బలం లేకపోయినా పంచుమర్తి అనూరాధతో చంద్రబాబునాయుడు నామినేషన్ వేయించారు. నామినేషన్ వేసిన దగ్గర నుండి తమ అభ్యర్ధి గెలుస్తారనే టీడీపీ నేతలంతా చాలా గట్టి విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళ విశ్వాసం ప్రకారమే అనూరాధ 23 ఓట్లు వచ్చాయి. టీడీపీకి ఉన్న బలం 19 ఓట్లు అయితే వచ్చింది 23 ఓట్లు.

అంటే వైసీపీ నుండి నలుగురు ఎంఎల్ఏలు టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారనే విషయం స్పష్టమైపోయింది. మొదటినుండి అనుకుంటున్నట్లే వైసీపీ రెబల్ ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి టీడీపీకి ఓట్లేస్తారని తెలిసిందే. అయితే వీళ్ళిద్దరు కాకుండా మరో ఇద్దరు ఎంఎల్ఏలు కూడా టీడీపీకి ఓట్లేశారు. ఒక్కో ఎంఎల్సీ అభ్యర్ధికి వైసీపీ  22 మంది ఎంఎల్ఏలను కేటాయించింది. అయితే ఇపుడు పంచుమర్తికి ఓట్లేసిన ఎంఎల్ఏలు ఎవరు అనేది పెద్ద పజిల్ గా తయీరైంది.

వైసీపీ తరపున పోటీచేసిన ఏడుగురిలో ఒకళ్ళకు ఓటమి తప్పదు. 22 ఓట్లు కాకుండా 21 ఓట్లు ఎవరికి అయితే వస్తాయో వాళ్ళు ఓడినట్లు లెక్క. మొదటి ప్రాధాన్యత ఓట్లు కాకుండా రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రకారం ఓడిన అభ్యర్ధిని నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో జయమంగళ వెంకటరమణ, కోలా గురువులుకు చెరొక 21 ఓట్లు వచ్చాయి. దాంతో రెండో ప్రాధాన్యత ఓట్లు తప్పనిసరైంది. చివరకు జయమంగళ గెలిచారు. 

పెనుమత్స సూర్యనారాయణరాజు, చంద్రగిరి ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయెల్, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ కు తలా 22 ఓట్లు వచ్చాయి కాబట్టి వీళ్ళంతా గెలిచినట్లే. విచిత్రం ఏమిటంటే వైసీపీకి ఒరిజినల్ గా 151 ఓట్లుండగా అదనంగా ఐదు ఓట్లు కలిసొచ్చాయి. మొత్తం 156 ఓట్లలో ఇద్దరు రెబల్ ఎంఎల్ఏలను తీసేసినా ఇంకా 154 ఓట్లుంటాయి. ఇపుడు తేలిందేమంటే 154 ఓట్లలో కూడా మరో రెండు మైనస్ అయ్యాయని. మొత్తానికి తాజా ఫలితం జగన్మోహన్ రెడ్డి షాకనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: