అతిచేస్తే గతిచెడుతుందనే సామెత తెలుగులో చాలా పాపులర్. ఇపుడు తెలంగాణాలోని ములుగు జిల్లాలోని తాడ్వాయి పోలీసుల వ్యవహారం అలాగే తయారైంది. మూడురోజుల క్రితం పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ పై పెట్టిన దేశద్రోహం కేసును ఎత్తేయాలని స్వయంగా కేసీయార్ ఆదేశాలు జారీచేశారు. హరగోపాల్ అంటే తెలంగాణాలో ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరంలేదు. అలాంటి హరగోపాల్ మీద పోలీసులు దేశద్రోహం కేసు నమోదుచేయటమే సంచలనంగా మారింది.
ఇంతకీ ప్రొఫెసర్ మీద పోలీసులు దేశద్రోహం కేసు ఎందుకు నమోదుచేశారు ? ఎందుకంటే మావోయిస్టుల దగ్గర దొరికిన డైరీలో హరగోపాల్ పేరుందట. డైరీలో పేరుంటే ఎవరిమీదైనా దేశద్రోహం కేసు పెట్టేయచ్చా ? అనడగద్దు. పోలీసులు తలచుకుంటే ఏమైనా చేయగలరు అనేందుకు తాజా ఘటనే ఉదాహరణ. మావోయిస్టుల డైరీలో హరగోపాల్ పేరుందుకు ఉందో రాసిన వాడికే తెలియాలి. డైరీలో పేరుందన్న ఒకే కారణంతో ప్రొఫెసర్ మీద దేశద్రోహం కేసు నమోదుచేయచ్చని పోలీసులకు ఎలాగ అనిపించిందో ఆశ్చర్యంగా ఉంది.
నిజానికి ఎవరిమీదా దేశద్రోహం కేసులు నమోదుచేయద్దని సుప్రింకోర్టు డైరెక్షనే ఉంది. దేశద్రోహం కాలంచెల్లిన బ్రిటీష్ కాలంనాటి చట్టమని సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పింది. అయినా ప్రభుత్వాలు లెక్కచేయటం లేదనేందుకు ఇదే ఉదాహరణ. ప్రభుత్వంలోని పెద్దల అనుమతి లేకపోతే ఆదేశాలు లేకుండానే కిందస్ధాయి పోలీసులు హరగోపాల్ మీద దేశద్రోహం కేసును పెట్టగలరా ? ఎప్పుడైతే విషయం బయటపడిందో వెంటనే ప్రతిపక్షాలు, విద్యార్ధిసంఘాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాయి.
ప్రతిపక్షాల ఒత్తిడి తట్టుకోలేక, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్వయంగా కేసీయార్ జోక్యం చేసుకుని దేశద్రోహం కేసును ఎత్తేయించారు. నిజంగానే ప్రొఫెసర్ దేశద్రోహానికి పాల్పడినట్లు పోలీసుల దగ్గర సాక్ష్యాలుంటే కేసీయార్ కాదు నరేంద్రమోడీ చెప్పినా కేసు ఉపసంహరించాల్సిన అవసరంలేదు. అలా కాకుండా దేశద్రోహం కేసుపెట్టి ప్రొఫెసర్ ను ఇరికించేద్దామని పోలీసులు అనుకుంటే మాత్రం చట్టాలు ఏ స్ధాయిలో దుర్వినియోగం అవుతున్నాయో అర్ధమవుతోంది. మొత్తానికి ప్రొఫెసర్ మీద దేశద్రోహం కేసు నమోదులో ఓవర్ యాక్షన్ కు పోయి పోలీసులే బకరాలైనట్లు అర్ధమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి