తన అజ్ఞానాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణే బయటపెట్టుకున్నారా ? తాజాగా ముగిసిన తెలంగాణా ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తే ఇదే విషయం అర్ధమవుతుంది. ఎందుకంటే అసలు ఉనికిలోనే లేని పార్టీ ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీచేయటమే నిదర్శనం. పోటీచేయటమే దండగ అనుకుంటే దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చారు. ఇపుడేమైందంటే రాబోయే ఫలితాల ప్రభావం కచ్చితంగా ఏపీపైన కూడా పడుతుంది. పోటీచేసిన నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులకు గట్టిపోటీ ఇస్తే జనసేన పరిస్దితి ఒక తీరుగా ఉంటుంది. లేకపోతే మాత్రం రెండోసారి పరువు పోగొట్టుకున్నట్లవుతుంది. రెండోసారంటే 2019 ఎన్నికల్లో మొదటిసారి పోయింది కాబట్టి.





నిజానికి తెలంగాణాలో పోటీనే అనవసరం. ఎందుకంటే పవన్ దృష్టంతా ఏపీ రాజకీయాలపైనే ఉంది. తెలంగాణా రాజకీయాల్లో  అడుగుపెట్టాలంటే కూడా భయపడిపోయారు. అలాంటిది ఏకంగా ఎన్నికల్లో అదికూడా బీజేపీ పొత్తులో పోటీచేయటంతోనే పవన్ అజ్ఞానమంతా బయటపడింది. పోనీ 8 చోట్ల  పోటీచేయించిన పవన్ అభ్యర్ధుల తరపున గట్టి ప్రచారం చేశారా అంటే అదీలేదు. కూకట్ పల్లి, తాండూరు, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, వైరా, ఖమ్మం, అశ్వారావుపేట, కోదాడలో పోటీచేసిన అభ్యర్ధులను వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేశారు.





ఏదో ఇక తప్పదన్నట్లుగా మొక్కుబడిగా వాళ్ళ తరపున ఒకటిరెండు సభల్లోను, ర్యాలీల్లోను పాల్గొన్నారంతే. అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా రాలేదంటే అందుకు కారణం పవనే అవుతారు కానీ అభ్యర్ధులు ఎంతమాత్రం కారు. ఊరు, పేరు లేని వాళ్ళని అందులోను బీజేపీలో నుండి చివరినిముషంలో జనసేనలో చేరిన కొందరికి టికెట్లిచ్చి పోటీచేయించారు. ఇక్కడే జనసేన డొల్లతనం బయటపడింది. పోటీచేయటానికి జనసేనలో అభ్యర్ధులు లేక చివరకు బీజేపీ వాళ్ళనే జనసేనలో చేర్చుకుని మళ్ళీ వాళ్ళకి జనసేన అభ్యర్ధులుగా టికెట్లివ్వటమే హైలైట్.





ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ అజ్ఞానమంతా స్పష్టంగా బయటపడింది. అభ్యర్ధుల ఎంపిక, వాళ్ళ తరపున ప్రచారం, ప్రచారంలో టచ్ చేయాల్సిన అంశాలు, ప్రత్యర్ధులను టార్గెట్ చేయటం లాంటివి ఏవీ లేవు. ఎంతసేపు తెలంగాణాలో కూడా జగన్మోహన్ రెడ్డిపైన బురదచల్లటం ఒకటే టార్గెట్ గా పెట్టుకున్నారు. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ గురించి మాట్లాడటంతోనే పవన్లోని అజ్ఞానమంతా బయటపడింది. మరి ఫలితాలు ఎలాగుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: