పై స్ధాయిలో అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కలిసిపోయారు. తాము కలిశాము కాబట్టి రెండుపార్టీల్లోని  కిందస్ధాయి నేతలు, క్యాడర్  కూడా కలవాల్సిందే అన్నారు. అందుకు తగ్గట్లే రెండుపార్టీల మధ్య సమన్వయ కమిటీలు కూడా వేసుకున్నారు. తర్వాత నియోజకవర్గాల వారీగా సమావేశాలు కూడా పెట్టుకున్నారు. అక్కడే అసలు విషయం బయటపడింది. కొన్ని నియోజకవర్గాల్లో రెండుపార్టీల నేతలు, క్యాడర్ మధ్య పెద్ద గొడవలయ్యాయి. దాంతో ఏమనుకున్నారో ఏమో సడెన్ గా సమన్వయ సమావేశాలు నిలిచిపోయాయి.





కొన్ని నియోజకవర్గాల్లో గొడవలు ఎందుకయ్యాయంటే సదరు నియోజకవర్గంలో టికెట్ కోసం రెండుపార్టీల నేతలు ఎవరికి వాళ్ళుగా గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు కాబట్టే. అమలాపురం, పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పీ గన్నవరం, తిరుపతి, రాజమండ్రి, పెందుర్తి లాంటి నియోజకవర్గాల్లో రెండు పార్టీల  మధ్య పెద్ద గొడవలే అయ్యాయి. ఈ గొడవలకు కారణాలు ఏమిటంటే ఒకపార్టీని, నేతలను మరో పార్టీ, నేతలు కావాలనే తక్కువచేసి చులకనగా మాట్టాడటమే. కావాలనే టీడీపీ నేతలు జనసేన నేతలను రెచ్చగొట్టేట్లుగా మాట్లాడటంతోనే గొడవలయ్యాయి.





హిందుపురం నియోజకవర్గ సమావేశంలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. ఇక్కడ అర్ధమైంది ఏమిటంటే హిందుపురంలో స్వయంగా నందమూరి బాలకృష్ణ పోటీలో ఉంటారని జనసేన నేతలు అనుకుంటున్నారు. ఇది టీడీపీ సిట్టింగ్ సీటు కావటంతో జనసేన పోటీగురించి ఆలోచించటంలేదు. పైగా బాలయ్య రెండుపార్టీల కండువాలు భుజనేసుకోవటం,  పవన్, జనసేనకు జిందాబాద్ అన్నారు. దాంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. పొత్తులు, నియోజకవర్గాలు తేల్చకుండా సమన్వయ సమావేశాలంటే  ఇలాగే గొడవలవుతున్నాయని గ్రహించినట్లున్నారు.





సీట్ల సంఖ్య, పోటీచేసే సీట్లను తేల్చకుండా సమన్వయ సమావేశాలు పెడుతుంటే గొడవలు మరింతగా పెరిగిపోయే అవకాశాలున్నట్లు రెండుపార్టీల నేతలు గ్రహించినట్లున్నారు. అందుకనే సమన్వయ సమావేశాలను నిలిపేసినట్లుగా అనుమానంగా ఉంది. వారం పదిరోజుల పాటు సమావేశాలు జరగటం, కొన్ని చోట్ల గొడవలవ్వటంతో ఆగిపోయాయి. మళ్ళీ సమన్వయ సమావేశాలు ఎప్పటినుండి జరుగుతాయో ? అసలు ఎందుకు ఆగిపోయాయో కూడా తెలీదు. బుధవారం జరిగిన చంద్రబాబు, పవన్ భేటీలో ఈ విషయం కూడా చర్చకు వచ్చినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మరి తెలంగాణా ఎన్నికల రిజల్ట్ నేపధ్యంలో సమన్వయ సమావేశాలు మొదలైతే టీడీపీ నేతలు మరింత చీపుగా మాట్లాడుతారేమో అనే అనుమానాలు కూడా జనసేనలో మొదలయ్యాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: