వైసీపీలో జరుగుతున్న మార్పుల ప్రభావం తెలుగుదేశంపార్టీలో స్పష్టంగా కనబడుతోంది. సర్వేల పేరుతో జగన్మోహన్ రెడ్డి తాజాగా 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చారు. ఇందులో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. రకరకాల కారణాలతో మంత్రులు, ఎంఎల్ఏలను ఇతర నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించారు. అంటే సిట్టింగ్ ఎంఎల్ఏలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాకుండా రాబోయే ఎన్నికల్లో ఇపుడు మార్చిన నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.





ఇదిపూర్తిగా వైసీపీ అంతర్గత విషయమనే చెప్పాలి. దీనిపై ఇతర పార్టీల జోక్యం అవసరమే లేదు. ఎందుకంటే ఎవరిని ఎక్కడినుండి పోటీచేయించాలన్నది పూర్తిగా అధినేత ఇష్టం. తొందరలోనే మరో 30 నియోజకవర్గాల్లో కూడా మార్పులుంటాయని తెలుస్తోంది. అయితే ఇదే విషయమై టీడీపీ మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ నోటికొచ్చినట్లు మాట్లాడారు. 11 నియోజకవర్గాల్లో జరిగిన మార్పులు చూస్తుంటే వైసీపీ ఓటమి ఖాయమని జగన్ కు కూడా తెలిసిపోయిందట. సొంత నియోజకవర్గంలో చెల్లనికాసు మరో నియోజకవర్గంలో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. ఇక్కడే బోండాలోని అజ్ఞానమంతా బయటపడింది.





నేతలు నియోజకవర్గాలు మారటం కొత్తేమీకాదు. చంద్రబాబునాయుడు చంద్రగిరి నియోజకవర్గం నుండి కుప్పంకు వలసవెళ్ళిన విషయాన్ని బోండా మరచిపోయినట్లున్నారు. పోయిన ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుండి వంగలపూడి అనిత కొవ్వూరుకు వెళ్ళి పోటీచేయలేదా ? కృష్ణా జిల్లాకు చెందిన వర్ల రామయ్య తిరుపతి ఎంపీగా పోటీచేసిన విషయాన్ని బోండా మరచిపోయినట్లున్నారు. తమ పార్టీలో ఎవరెక్కడినుండైనా పోటీచేయచ్చు. వైసీపీలో నియోజకవర్గం మారినవాళ్ళు మాత్రం చెల్లనికాసులట. వైసీపీలో ఇప్పుడే 11 వికెట్లు పడిపోయాయని అనటం ఏమిటో బోండాకే తెలియాలి.





వైసీపీలోని సగంమంది ఎంఎల్ఏలు తమతో టచ్ లో ఉన్నట్లు బోండా చెప్పారు. ఉత్తరాంధ్రలోని ఒక మంత్రే కుటుంబంతో సహా టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. చంద్రబాబు కనుసైగ చేస్తే చాలట ఇప్పటికిప్పుడు 40 మంది ఎంఎల్ఏలు టీడీపీలోకి జప్ అయిపోతారని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే సగానికి సగంమంది ఎంఎల్ఏలు టచ్ లో ఉంటే అందరినీ చేర్చేసుకుని జగన్ను అధికారంలోకి నుండి దింపేయచ్చు కదా ? ఆపనెందుకు చేయటంలేదు ?  బోండా మాటల్లోనే టీడీపీలో భయం కనబడుతోంది. కొత్త మొఖాలను జగన్ పోటీలోకి దింపితే వాళ్ళెక్కడ గెలిచేస్తారో అనే భయం పెరుగుతున్నట్లుంది. అందుకనే ఏదిపడితే అది మాట్లాడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: