ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం కీలక మలుపులు తిరుగుతుంది.. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు చూపిస్తున్నారు. అయితే సీటు దక్కని నాయకులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీని వీడి వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు.చీరాల మాజీ ఎమ్మెల్యే వైసీపి పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు.తాను త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తన స్వగృహంలో తన అనుచరులు, శ్రేయోభిలాషులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ప్రకటించారు.గత ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఆమంచి ఓడిపోయారు.గత ఎన్నికలలో రాష్ట్రమంతా వైసీపీ ప్రభంజనం సృష్టించిన సమయంలో ఆమంచి చీరాలలో ఓడిపోయారు. అయినా కూడా జగన్ ఆయనకు గౌరవం ఇస్తూనే వచ్చారు. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవాన్ని కూడా జగన్ ఆమంచి చేయి పట్టుకుని చేయించడం ఆయనకు వైసీపీలో ఇచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనం అని చెప్పొచ్చు.

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలోకి రావడంతో సీన్ రివర్స్ అయిపోయింది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం బలరాం వైసీపీలో చేరారు. అప్పుడు మాట ఇచ్చినట్లుగా బలరాం కుమారుడు కరణం వెంకటేష్‌కు జగన్ చీరాల వైసీపీ టికెట్ ను ఇచ్చారు. అయితే దానికి ప్రత్యామ్నాయంగా అంతకు ముందే ఆమంచిని పర్చూరుకు పంపారు. చీరాలతో పోల్చితే పర్చూరులో ఆమంచి సామాజికవర్గమైన కాపుల ఓట్లు ఎక్కువ. నియోజకవర్గ కేంద్రం పర్చూరుతోపాటు చినగంజాం మరియు ఇంకొల్లు మండలాల్లోనూ కాపుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి అయితే ఆమంచికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జగన్ భావించారు. అయితే కావాలనే తనను చీరాలకు దూరం పెడుతున్నారని భావించిన ఆమంచి వైసీపీకి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికొచ్చారు. అంతకు ముందు టీడీపీలో ఉన్నా కూడా తనను అంతగా పట్టించుకోలేదని భావించిన ఆమంచి చివరికి తన సొంత పార్టీ కాంగ్రెస్‌లోకే వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: